Saturday, January 22, 2011

వీరికి జేజేలు లేవు... * జనం మదిని గెలవని ప్రభుత్వ పెద్దలపై జగన్ ధ్వజం

‘నాన్న బతికున్నప్పుడు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. బతికి ఉన్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం కాదు.. చనిపోయాక ఎందరి గుండెల్లో బతికి ఉన్నామన్నదే గొప్ప సంగతీ అనేవారు. కానీ ప్రస్తుత పాలకులు కనీసం బతికి ఉన్నప్పుడు కూడా జేజేలు కొట్టించుకోలేకపోతున్నారు. తమ గోడు వినేవారు లేక సామాన్యులు ఆకాశం వైపు చూసి దేవుడా.. వైఎస్‌ను మళ్లీ పంపు అని వేడుకుంటున్నారు’ అని యువనేత వైఎస్ జగన్ ప్రభుత్వ పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో చివరి రోజు శుక్రవారం ఓదార్పు యాత్రలో భాగంగా పాతగాజువాకలో ఆయన మాట్లాడారు.

‘వరదల మీద వరదలు, దెబ్బ మీద దెబ్బ పడుతోందని లక్ష మంది రైతులు కలిసి విజయవాడలో దీక్ష చేస్తే వారికి న్యాయం చేయరు.. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పు అన్యాయంగా ఉందని, రాష్ట్రం పూర్తిగా ఎడారిగా మారుతుందని ఢిల్లీలో రోజంతా దీక్ష చేస్తే ప్రజల గోడు వినేందుకు ప్రధానమంత్రికనీసం ఐదు నిమిషాలు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వరు. వైఎస్ బతికున్నప్పుడు పోలవరం పనులు చకచకా నడిస్తే.. ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న పరిస్థితి ఉంది. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల, దుమ్ముగూడెం టెయిల్‌పాండ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు ఎందుకు ఇవ్వరు? అని అడుగుతున్నా.. రాష్ట్రం అథోగతి పాలవుతుంటే పట్టించుకునే నాథుడేడీ అని అడుగుతున్నా..’ అంటూ జగన్ ఆందోళన వ్యక్తంచేశారు.


గాజువాకలో జనహోరు..
విశాఖ జిల్లాలో పదో రోజైన ఓదార్పు యాత్ర శుక్రవారం విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల మీదుగా సాగింది. నగరంలోని రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. గురువారం రాత్రి గాజువాకలో బస చేసిన జగన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు పెదగంట్యాడలో విగ్రహావిష్కరణతో యాత్ర ప్రారంభించారు. ఇక్కడ మొదలైన జనహోరు అర్ధరాత్రి వరకు కొనసాగింది. మధ్యాహ్నం ఒంటిగంటలోగా పెదగంట్యాడ, సీతానగరం, దేశపాత్రునిపాలెం, గౌతు లచ్చన్ననగర్, అగనంపూడి సెంటర్లలో విగ్రహాలు ఆవిష్కరించారు. తరువాత కూర్మన్నపాలెం, శ్రీనగర్, డ్రైవర్స్‌కాలనీలలో విగ్రహాలు ఆవిష్కరించారు. అక్కడి నుంచి పాతగాజువాక సెంటర్‌కు చేరుకున్నారు. ఇక్కడి విగ్రహావిష్కరణకు భారీగా జనం తరలివచ్చారు. ఈ హైవే జంక్షన్‌లో జనం కిక్కిరిసిపోయారు.

ఇక్కడి నుంచి కొత్తగాజువాక, బీసీరోడ్డు తదితర ప్రాంతాల రహదారుల్లో జనం పోటెత్తారు. కొత్తగాజువాక, బీసీరోడ్డులలో విగ్రహాలు ఆవిష్కరించాక.. సాయంత్రం 6.30కు ఆనందపురం చేరుకున్నారు. ఆనందపురం అంతా ఒక్కటై సెంటర్‌కు తరలివచ్చింది. అనంతరం వెల్లంకిలో విగ్రహావిష్కరణ చేసి తగరపువలస వైజంక్షన్ చేరుకున్నారు. ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించి పట్టణ కూడలిలో మరో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కూడలి జనసంద్రంగా మారింది. మూడు గంటలు ఆలస్యమైనా జనం ఓపిగ్గా నిరీక్షించారు. ఇక్కడి నుంచి జగన్ రాత్రి 8.50కి చిల్లపేట చేరుకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత భీమిలిలో రెండు విగ్రహాలు ఆవిష్కరించి, పసుపులేటి వెంకటరమణ కుటుంబాన్ని ఓదార్చారు. మీ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తర్వాత 11 గంటలకు గంభీరంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత బోరవాని పాలెం, కొమ్మది జంక్షన్, చంద్రంపాలెం, 12.30కు పీఎం పాలెంలలో విగ్రహాలను ఆవిష్కరించారు.

నిర్వాసితులకు బాసట

ఉదయం అగనంపూడిలో జగన్ మాట్లాడుతూ ‘విశాఖకు స్టీలు ప్లాంటు రావాలని 1969 నుంచి 71 వరకు జరిగిన ఉద్యమంలో 52 మంది ప్రాణ త్యాగం చేశారు. ఆ త్యాగాలతో వచ్చిన ప్లాంటుకు స్థానికులు 28 వేల ఎకరాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఆర్ కార్డుల సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. కానీ వైఎస్సార్ ఏ ఒక్కరినీ గాలికి వదిలేయలేదు. స్టీలు ప్లాంటు విస్తరణ జరిగేటప్పుడు నిర్వాసితులు అందరికీ ఉద్యోగాల్లో 50 శాతం కేటాయింపును ఇస్తూ ఆర్ కార్డులు పంపిణీ చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కింది..’ అని అన్నారు.

విశాఖలో ముగిసిన ఓదార్పు..

విశాఖపట్నం జిల్లాలో శుక్రవారంతో ఓదార్పుయాత్ర ముగిసింది. తొలివిడతలో జనవరి 3 నుంచి 8 వరకు సాగగా.. మలివిడత 18వ తేదీ నుంచి శుక్రవారం వరకు కొనసాగింది. మహానేత మరణ వార్త విని ప్రాణాలు కోల్పోయిన 18 మంది అభిమానుల కుటుంబాలను జగన్ ఈ ఓదార్పు యాత్రలో పరామర్శించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 200 విగ్రహాలు ఆవిష్కరించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా జన దీక్ష: అంబటి

రాష్ట్ర ప్రజల కష్టాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా యువనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేపడుతున్నారని ఏపీఐఐసీ మాజీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. సాగర తీరంలో యువనేత నిర్వహిస్తున్న జన దీక్ష ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. జగన్ ఉద్యమంపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత రచ్చబండ కార్యక్రమంపై స్పందిస్తూ కాంగ్రెస్‌లో రచ్చ ఎపుడో మొదలయిందని, ప్రస్తుతం బండే మిగిలుందన్నారు.

Saturday, January 8, 2011

ఆదుకుంటా.. అండగా ఉంటా..

విశాఖ జిల్లా నాతవరం వుండలం ఎం.బి.పట్నంలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక అసువులుబాసిన ఉలబాల అక్కయ్యువ్ము కుటుంబాన్ని జగన్ శనివారం సాయుంత్రం ఓదార్చారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని, అండగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి  రాజశేఖరరెడ్డి వురణాన్ని తట్టుకోలేక గత 2009 సెప్టెంబర్ 3న అక్కయ్యువ్ము మృతి  చెందింది. ఎలాంటి కష్ట మొచ్చినా ఆదుకుంటానని జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఆమె భర్త నూకరాజును, పెద్దకొడుకు పెదనూకరాజును ఓదారుస్తూ.. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఎవరేమి పనులు చేస్తున్నారంటూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

అక్కయ్యువ్ముకు ముగ్గురు కొడుకులుండగా వారిలో ఇద్దరికి వివాహమై వ్యవసాయు కూలీలుగా పనిచేస్తున్నారు. మూడో కొడుకు ఉలబాల లోవ బీఎస్సీ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నానని, దారి చూపాలని అతను జగన్‌ను కోరాడు. తప్పకుండా ఆదుకుంటావుని జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. సువూరు పది నిమిషాలపాటు అక్కడ గడిపారు. యువనేతతోపాటు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రావుకృష్ణ, ఎం.బి.పట్నం సర్పంచ్ వర్రె సత్యనారాయుణ ఉన్నారు.

Thursday, January 6, 2011

ఉద్విగ్న క్షణాలు..

చెమ్మగిల్లిన నయనాలు.. మౌన వేదనతో కరువైన మాటలు.. ఇవీ అక్కడ నెలకొన్న ఉద్విగ్న క్షణాలు.. మహానేత వైఎస్ అకాల మరణంతో గుండె ఆగి చనిపోయిన మజ్జి కొండబాబు కుటుంబాన్ని యువనేత జగన్ బుధవారం ఓదార్చారు. ఇందుకోసం ఆయన ఇసుకగరువుకు చేరుకోగానే స్థానిక గిరిజనులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. జగన్ కొండబాబు ఇంట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొండబాబు భార్య రత్నాలమ్మ, కుమారులు శ్రీను, రవిలను పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జగన్‌ను చూడగానే కొండబాబు కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. వారి ఆవేదన చూసి యువనేత కళ్లు చెమర్చాయి. దీంతో కొద్ది నిమిషాలు ఉద్విగ్నంగా గడిచాయి. యువనేత కొంత సమయానికి తేరుకుని.. ఎలాంటి కష్టమొచ్చినా అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. వారిచ్చిన చోడి అంబలిని ఎంతో ఇష్టంగా సేవించారు. అనంతరం తనను చూసేందుకు వచ్చిన గిరిజనులందరినీ జగన్ పలకరించి ముందుకు సాగారు.

కష్టసుఖాల్లో తోడునీడగా..
కష్టసుఖాల్లో అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా తనకు ఒక్క ఫోన్ చేయమని మల్లవరపు పెదకొండబాబు కుటుంబానికి యువనేత జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక కింతలివల్లాపురానికి చెందిన కొండబాబు మనోవేదనతో మృతి చెందారు. బుధవారం రాత్రి 8 గంటలకు జగన్ వారింటికి చేరుకొని మృతుని భార్యను, ఇద్దరు పిల్లల్ని ఓదార్చారు. సుమారు 20 నిమిషాలపాటు వారి ఇంట గడిపి చిన్నారులు మల్లిక, తరుణ్‌లను ఒడిలోకి తీసుకొని ముద్దాడారు. కొండబాబు తల్లిదండ్రులు రాజు, పైడమ్మ, చెల్లెలు రత్నంతో మాట్లాడారు. ఏ ఆపద వచ్చినా నేనున్నానని వారికి ధైర్యం చెప్పారు. తమ ఇంటికి వచ్చి కన్నీరును తుడిచిన జగన్‌కు తామెప్పుడూ రుణపడి ఉంటామని మృతుడి భార్య, తల్లిదండ్రులు చెప్పారు.

Tuesday, January 4, 2011

నేనున్నానని...

విశాఖ జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురంలో వైఎస్ దుర్మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన రాజమహేంద్రవరపు సన్యాసి కుటుంబాన్ని యువనేత జగన్ మంగళవారం ఓదార్చారు. సన్యాసి ఇంటికి వెళ్లి ఆమె భార్య మహాలక్ష్మమ్మ, కుమారుడు అప్పారావు, కోడలు లక్ష్మి, కుమార్తె వరలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్‌కు వీరాభిమానిగా ఉన్న సన్యాసి ఆయన మరణవార్త విన్నప్పట్నుంచీ దిగాలుగా ఉండేవాడని, 2009 సెప్టెంబరు 5న మహానేత చిత్రపటం ఊరేగింపును చూస్తూ అక్కడికక్కడే కుప్పకూలాడని కుటుంబ సభ్యులు జగన్‌కు తెలిపారు. కాసేపటికే ఆయన మరణించాడని వివరించారు. తమకు సొంతిల్లు కూడా లేదని, సన్యాసి మరణంతో తమ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని విలపించారు. సన్యాసికి ప్రతి నెలా వచ్చే పింఛనును తమ కుటుంబంలో ఒకరికి ఇప్పించాలని ప్రాథేయపడ్డారు. దీనిపై స్పందించిన జగన్ మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. యువనేత తమను ఓదార్చడానికి వచ్చినందుకు సన్యాసి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పండ్లు తినిపించారు.
అండగా నేనుంటా...
రావికమతం (విశాఖ జిల్లా): వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక గౌరీపట్నంలో మృతిచెందిన కలవలపల్లి వెంకునాయుడు కుటుంబాన్ని యువనేత జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఓదార్చారు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వెంకునాయుడు ఇంటికి చేరుకున్న జగన్.. ఆయన భార్య నారాయణమ్మ, కుమార్తెలు జగ్గయ్యమ్మ, రమాదేవి, చంద్రలక్ష్మిలను పరామర్శించారు. జగన్‌ను చూసి వారు కన్నీరుమున్నీరయ్యారు. వెంకునాయుడు వైఎస్‌పై ఎంతో మమకారం చూపించేవారని చెప్పారు. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారన్న వార్తలు టీవీలో చూస్తూనే చనిపోయాడని వివరించారు. వారి కన్నీళ్లు తుడిచిన జగన్.. కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. 
కన్నమ్మ ప్రేమ..
ఆమె వయస్సు 90 ఏళ్లు. పేరు కన్నమ్మ. విశాఖ జిల్లా చోడవరంలోని యడ్లవీధిలో ఉంటోంది. ఎవరైనా చేయందిస్తేనేగాని కూర్చొని లేచే ఓపిక లేదు. అలాంటి స్థితిలో ఊతకర్ర చేత పట్టుకుని పడుతూ లేస్తూ జనసంద్రంలోకి ప్రవేశించింది. ‘ఆ మారాజు (వైఎస్) కొడుకు జగన్‌బాబొచ్చేడంట కదా? ఎక్కడున్నాడు బాబూ..? అంటూ జనాన్ని తప్పించుకుంటూ సభా వేదిక సమీపంలోకి వచ్చింది. అదీ ఒట్టి చేతుల్తో కాదు.. తనకు వైఎస్ పుణ్యాన వచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు చేతబట్టుకుని!

‘ఆ బాబు (వైఎస్) పున్నాన్ని (పుణ్యాన) నెలకి రెండొందలు పించిణీ (పెన్షన్) తీస్కుంటున్నాను. ఆరోగ్గం బాలేకపోతే ఈ కార్డుతో బాగు సేయించుకున్నాను. నా పెనిమిటి (భర్త) లేడు, పిల్లలూ లేరు. ఒక్కదాన్నే ఉంటున్నాను. కళ్లు కూడా బాగా ఆనడం లేదు. ఆ బాబును (జగన్)ను సూసిపోదామనొచ్చేను. సూపించరు బాబూ...’ అని అడగ్గా.. అక్కడున్న వారు అదుగో... అతనే జగన్‌బాబు... చూడు అంటూ చూపించారు. యువనేతను చూసిన సంబరంతో.. ‘నా నాయనే సల్లంగా ఉండు’ అని దీవించింది.

Monday, January 3, 2011

విశాఖే కదిలి వచ్చింది * జగన్ కోసం తరలివచ్చిన జనప్రవాహం - కిక్కిరిసిపోయిన రోడ్లు.

* 11న ఢిల్లీ దీక్ష నేపథ్యంలో 10 నుంచి విశాఖ ఓదార్పుకు విరామం
* సంక్రాంతి తర్వాత పునఃప్రారంభం



విశాఖ జనమంతా వీధుల్లోకి వస్తే.. ఆ వీధులన్నీ మెయిన్‌రోడ్డువైపే పరుగులు తీస్తే... ఆ రోడ్లు ఇసుకవేస్తే రాలనంతలా కిక్కిరిసిపోతే... అదంతా ఒకే ఒక్కనాయకుడి కోసమైతే.. సోమవారం ఇదే దృశ్యం విశాఖలో ఆవిష్కృతమైంది. ఓదార్పుయాత్ర కోసం వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనంగాస్వాగతం పలికేందుకు, నీ వెంట మేమున్నామని చాటేందుకు జనం రోడ్లపైకి వచ్చారు. విమానాశ్రయం మొదలు యువనేత సాగిన ప్రతిదారీ జనసంద్రాన్ని తలపించేలా వచ్చిన అభిమానులు జగన్‌ను తమ ఆత్మీయ బంధువుగా అక్కున చేర్చుకున్నారు. జై జగన్ నినాదాలతో యువకులు ర్యాలీలుగా వెంట రాగా.. మహిళలు భారీ సంఖ్యలో బారులు తీరి స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జగన్‌కు స్వాగతం పలికారు.

కట్టలు తెంచుకున్న అభిమానం..
జిల్లాలో 18 కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30కు విమానాశ్రయంలో దిగిన ఆయన.. వేలాది మంది తరలివచ్చినా.. అక్కడి నుంచి వడివడిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అయినా జనం పోటెత్తడంతో దగ్గరలో ఉన్న ఎన్‌ఏడీ జంక్షన్ చేరేసరికి 45 నిమిషాలు పట్టింది. అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి.. భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కంపర బాబూరావు కుటుంబాన్ని ఓదార్చేందుకు 2.40కి పద్మనాభనగర్ చేరుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి 4.30కు నాయుడుతోటలో, 4.55కు వేపగుంటలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు.

ప్రతి ఒక్కరూ రోజూ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు.. చివరికి అన్నం తింటున్నప్పుడు కూడా నాన్నను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారని.. ప్రతి ఒక్కరితో వైఎస్‌కున్న అనుబంధాన్ని గుర్తుకుతెచ్చారు. రైతులు, చేనేత కార్మికులు, పేదవాళ్లు, వైఎస్‌ను ఎలా గుర్తుకు తెచ్చుకుంటున్నారో చెబుతూ జగన్ ముందుకు కదిలారు. సాయంత్రం 6.00 గంటలకు సింహాచలం చేరుకున్నారు. దారి పొడవునా ప్రతి పల్లెలో జనం జగన్‌కు స్వాగతం పలికారు. 6.40 సింహాద్రి అప్పన్నను దర్శించుకుని 8.10కి శొంఠ్యాం దగ్గర గండిగుండెం జంక్షన్ చేరుకున్నారు. అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. 8.30కు నీళ్లగుండీలు గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ కాలనీవాసులు తమ కాలనీకి వైఎస్‌ఆర్ కాలనీ అని పేరుపెట్టుకుని తమ అభిమానం చాటుకున్నారు. అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు గుర్రంపాలెం చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వచ్చేదని..
9.25కు పెందుర్తి మండల కేంద్రానికి చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని రాష్ట్రానికే కాదు.. దేశానికి చాటిచెప్పిన వ్యక్తి వైఎస్’ అని గుర్తు చేసుకున్నారు. మాట ఇస్తే నష్టమైనా కష్టమైనా నిలబడాలని చెప్పేవారని, ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యమని చెబుతుండేవారని జగన్ ప్రసంగిస్తున్నప్పుడు జనం జగన్‌కు జేజేలు పలికారు. వైఎస్ జోహార్ అంటూ నినదించారు. విలువలు, విశ్వసనీయతకు అర్థం తెచ్చిన వ్యక్తి వైఎస్ అని చెబుతున్నప్పుడు జనం చప్పట్లతో హోరెత్తించారు.

ఆ మహానుభావుడు బతికే ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వచ్చేదని ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నప్పుడు.. అవునూ.. అవునూ.. అంటూ నినదించారు. రాత్రి 10 గంటలకు సుజాతనగర్‌లో విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. 10.20కి రామాపురంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి గండి భూలోకయ్య కుటుంబాన్ని ఓదార్చారు. 11 గంటలకు పినగాడి జంక్షన్, 11.30కు సబ్బవరంలో విగ్రాహావిష్కరణలకు జనం కిక్కిరిసిపోయారు. తర్వాత లింగాలతిరుగుడులో దొడ్డి కోటేశ్వరరావు కుటుంబాన్ని ఓదార్చిన యువనేత 12.45 గంటలకు అడ్డూరులో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అర్ధరాత్రి దాటాక కూడా యాత్ర కొనసాగుతోంది.

ఓదార్పుకు విరామం
11న ఢిల్లీలో దీక్ష చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో 10వ తేదీ నుంచి విశాఖ ఓదార్పుకు జగన్ విరామం ఇవ్వనున్నారు. సంక్రాంతి తర్వాత యాత్ర పునఃప్రారంభమవుతుంది.

ఏ అవసరమొచ్చినా ఫోన్ చేయండి
‘మీకు అండగా ఎవరూలేరని అనుకోకండి.. మీకే కష్టమొచ్చినా నేనున్నాను.. అవసరమైతే ఫోన్ చేయండి’ అంటూ కంపర బాబూరావు కుటుంబానికి యువనేత జగన్ భరోసా ఇచ్చారు. విశాఖలోని గోపాలపట్నం శివారు పద్మనాభనగర్‌లో వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన బాబూరావు ఇంటికి సోమవారం మధ్యాహ్నం యువనేత వెళ్లారు. మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కంటతడి పెట్టుకున్న బాబూరావు తల్లి అప్పలనర్సమ్మను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబ పరిస్థితి, సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ‘మీ నాన్న చనిపోయిన బాధలోఉన్నా మా కోసం వచ్చావా బాబూ...’ అంటూ అప్పలనర్సమ్మ జగన్‌ను అక్కున చేర్చుకున్నారు. బాబూరావు సోదరుడు నాగరాజు, సోదరి కన్నమ్మల బాగోగులను యువనేత అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబం ఆప్యాయంగా పెట్టిన స్వీట్లు, పండ్లు తిన్నారు.
భూలోకయ్య కుటుంబానికి భరోసా...
విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని రాంపురం గ్రామంలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలొదిలిన గండి భూలోకయ్య కుటుంబాన్ని యువనేత జగన్ సోమవారం రాత్రి పదిన్నర గంటలకు పరామర్శించారు. భూలోకయ్య భార్య నాయుడమ్మ, కుమారులు భీముడు బాబు, గణపతిరావు, భూషణరావులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. పదోతరగతి చదువుతున్న కుమార్తె రూప ఉన్నత చదువులకోసం సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. నాయుడమ్మ చేతుల మీదుగా పాయసం, యాపిల్ పండు ముక్కలు, పిల్లల చేతుల మీదుగా స్వీట్లు తిన్నారు. వారికి ఏసమస్య వచ్చినా తాను అండగా ఉంటానన్నారు. తన ఫోన్ నంబర్ ఇచ్చి సమస్యల్లో ఆసరాగా ఉంటానని భరోసా ఇచ్చారు. అక్కడకు వచ్చిన మహిళలు జగన్‌కు అభిమానంతో రాఖీలు కట్టారు. ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. పదినిమిషాలపాటు ఆ ఇంట గడిపిన జగన్ 10.50గంటలకు బయటకు వచ్చి యాత్ర కొనసాగించారు.

Sunday, November 7, 2010

జన సునామీ * ఓదార్పుకు స్పందన అనూహ్యం

బంగాళాఖాతంలో‘జల్’పెను తుపాను.. తీరంలో అల్లకల్లోలం... జిల్లా వ్యాప్తంగా వర్షాలు... ఇది ఆదివారం ఉదయం పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ఓదార్పుయాత్ర ముగింపు కార్యక్రమం ఏ విధంగా జరుగు తుందోనని ఆయన అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ.

ఉదయం నుంచి మబ్బులు కమ్మిన ఆకాశం. అప్పుడప్పుడు కురుస్తున్న చిరుజల్లులు. సాధారణంగా వర్షం కురిస్తే మోకాటిలోతు నీళ్లు నిలిచే నెల్లూరు ప్రధాన రోడ్లు, వీధులు ‘జన’మయమయ్యాయి. వర్షం వస్తే బోసిపోయే రోడ్లపై ఎక్కడ చూసినా జనమే. జోరు వర్షంలోనూ కదలని జనం. కురుస్తున్న వర్షం చినుకులు రోడ్డు మీద పడని పరిస్థితి. ఇదీ ఆదివారం నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటరులో కనిపించిన దృశ్యాలు.

యువనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదివారం నెల్లూరులో చివరిరోజు ఓదార్పుయాత్రను నిర్వహించారు. అభిమానులు కడలి కెరటాల్లా తరలివచ్చి యువనేతకు నీరాజనం పలికారు. కటౌట్లు, ఫ్లెక్సీ బోర్డులు, భవనాలు, మిద్దెలు, దుకాణాలు, ట్రాఫిక్ డివైడర్లు, ఐల్యాండ్లు ఇలా ప్రతి చోటూ జనంతో నిండిపోయాయి. యువతనేతను ఆత్మీయంగా పలుకరించాలని ఉదయం నుంచి నగరవాసులు ఎదురుచూశారు, బొకేలు, పూలమాలలు చేతబట్టి రోడ్లపై చేరారు.
నెల్లూరు నగరంలోని మనోహర్‌రెడ్డి నివాసం నుంచి జిల్లాలో చివరి రోజు ఓదార్పుయాత్రను జగన్ ప్రారంభించారు. జగన్‌ను కలిసేందుకు వచ్చిన నాయకులు, అభిమానులతో మనోహర్‌రెడ్డి నివాసం కిక్కిరిసిపోయింది.

అక్కడకి వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగిన జగన్ నీలగిరి సంఘానికి చేరుకుని మహబూబ్‌బాషా కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్‌కు బయలుదేరిన జగన్‌పై అడుగడుగునా జనం అభిమానం కురిపించారు. చిరుజల్లులు కురుస్తున్నా జనం ఖాతరుచేయలేదు. విద్యార్థులు, యువకులు, చిన్నారులు, మహిళలు ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. మహిళలు జగన్‌కు దిష్టి తీయడంతో పాటు మంగళ హారతులిచ్చారు. అభిమాన బంధాలను దాటుకుంటూ జగన్ గాంధీబొమ్మ సెంటర్ సమీపంలోకి చేరుకున్నారు. అప్పటికే గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్‌సీ సెంటర్, కనకమహాల్ సెంటర్, ఏసీ సెంటర్‌ల వరకూ జనం కిటకిటలాడుతున్నారు. కనీవినీ ఎరుగనిరీతిలో తరలివచ్చిన జనం మధ్య జగన్ కాన్వాయ్ ముందుకు సాగడం కష్టతరంగా మారింది. ప్రతి ఒక్కరూ జగన్ చేతి స్పర్శ కోసం పోటీపడ్డారు. వాహనాన్ని విగ్రహావిష్కరణ వేదిక వద్దకు తీసుకెళ్లేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

జగన్ వేదికపైకి చేరుకోగానే ఆ ప్రాంతం కాబోయే సీఎం..జగన్ అనే నినాదాలతో హోరెత్తింది. అనంతరం నిలువెత్తు వైఎస్సార్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అప్పటికే వర్షం మొదలైనా జనం లెక్కచేయలేదు. జగన్ చేసిన ప్రసంగాన్ని వింటూ విశేషరీతిలో స్పందించారు. జగన్ ప్రసంగం మొదలైన సమయంలో తుంపర్లుగా పడుతున్న వర్షం ముగిసే సమయానికి జోరువానగా మారింది. అయినప్పటికీ జనం వెనకడుగు వేయకుండా ఆసక్తికరంగా సాగిన జగన్ ప్రసంగాన్ని విన్నారు.

చివర్లో సీఎం..సీఎం...సీఎం..సీఎం..అంటూ నినాదాలతో హోరెత్తించారు. నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, సినీ నటి రోజా, సినీనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి, అంబటి రాంబాబు. గట్టు రామచంద్రరావు, పుల్లా పద్మావతి, కాటం అరుణమ్మ, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, రెహమాన్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తదితరుల ప్రసంగాలకు కూడా జనం నుంచి విశేష స్పందన లభించింది. జోరువాన కురుస్తున్నా జగన్ అక్కడి నుంచి వెళ్లేంత వరకు జనం కదలకపోవడం విశేషం. అక్కడి నుంచి డైకస్‌రోడ్డు సెంటర్‌కు చేరుకుని వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడ ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు.

వర్షంలోనూ ప్రజలు హాజరుకావడంతో వారిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. వైఎస్సార్‌పై ఇంతటి ఆదరాభిమానాలను ప్రదర్శించడం హర్షణీయమన్నారు. సీఏఎం స్కూలు సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ వైఎస్సార్‌పై స్థానిక ముస్లింనేత ఆలపించిన గీతాన్ని జగన్ ఎంతో ఆసక్తిగా విన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జేకేరెడ్డి ఇంట్లో ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించారు. సన్నీ హైట్స్ హోటల్ అధినేత బలరామిరెడ్డి నివాసంలో భోజనానికి హాజరయ్యారు. అనంతరం నెల్లూరు నగర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు, వెంకటాచలం మండలం గొలగమూడి, అనికేపల్లి, తిక్కవరప్పాడులలో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి చెన్నైకు బయలుదేరారు.
నగరంలోని బట్వాడిపాళెం చర్చిలో జననేత ప్రార్థనలు చేశారు. తదుపరి కనుపర్తిపాడు వెళుతూ మార్గమధ్యలో మాజీ కౌన్సిలర్ మాథ్యుస్ కోరిక మేరకు కొండాయపాళెం బాప్టిస్టు చర్చి వద్ద ఆగారు. చర్చిలో ప్రార్థన చేసి మతపెద్దలు ఆశీస్సులు పొందారు. 
 
ఓదార్పుకు స్పందన అనూహ్యం
ఓదార్పుయాత్రలో భాగంగా యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లాలో ఓదార్పుయాత్ర ప్రారంభం నుంచి ప్రజల హృదయాలను తాకేలా ఆయన మాట్లాడారు. దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి చోటా ఆయన ప్రస్తావించారు. ఆ పథకాల పేర్లను ప్రస్తావించినప్పుడల్లా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. ఒక్కో పథకం పేరు చెబితే చాలు జనంలో నుంచి వైఎస్సార్..వైఎస్సార్..వైఎస్సార్ అని సమాధానం వచ్చేది.

దివంగత నేత వైఎస్సార్ మాదిరిగానే 108 వాహన సేవలను వివరించినప్పుడు ఆయన చెప్పే కుయ్..కుయ్..కుయ్ పదాలకు జనం కూడా శృతి కలిపారు. ప్రధానంగా జగన్ ఉచ్చరించే గుర్తుకొస్తూనే ఉంటారు...అనే మాటకు జనంలో నుంచి కేరింతలు వెల్లువెత్తాయి. ఆయన తన ప్రసంగాల్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి, పారిశ్రామికాభివృద్ధి, సంక్షేమ పథకాలు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, రెండు రూపాయలకే కిలోబియ్యం, పావలా వడ్డీకి రుణాలు, రుణమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలను వివరించినప్పుడు జనం మరొక్కసారి దివంగతనేత వైఎస్సార్‌ను గుర్తుచేసుకున్నారు.

జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్ విగ్రహా విష్కరణ కార్యక్రమాల్లో చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తమకు వైఎస్సార్ చేసిన మేలును వివరించేందుకు వేదికల మీదకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. తమకు రెండు నిమిషాలు అవకాశమిస్తే మహానుభావుడు వైఎస్సార్ చేసిన ఉపకారాన్ని వివరించి తృప్తి పడతామని కోరారు. జగన్ వారందరికీ అవకాశం కల్పించారు. అలా వారు చేసిన ప్రసంగాలకు జగన్‌తో పాటు జనం కూడా మురిసిపోయారు.
ముగింపు ప్రసంగం అదరహో..

ఓదార్పుయాత్ర ఆఖరురోజైన ఆదివారం నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహా విష్కరణ అనంతరం జగన్ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన ఓదార్పుయాత్రకు అడ్డంకులు సృష్టిస్తూ అవాకులు, చవాకులు పేలుతున్న వారిపై నిప్పులు చెరిగారు. కొండా సురేఖ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అంబటి రాంబాబు, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గట్టు రాంచంద్రరావులు ఏం చేశారని చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కుట్రలు, కుతంత్రాలతో జగన్‌ను ఒంటరి చేయలేరన్నారు. ప్రతిపక్షం కంటే స్వపక్షనేతలే తనపై అబద్ధాలు చెప్పి బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగన్‌ను ఒంటరి చేసేందుకు తనను నమ్ముకున్న వారిని పథకం ప్రకారం బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్టీలో ఉన్నవారికి నరకయాతన చూపిస్తున్నారన్నారు. ఇలా చేయడం న్యాయమా అంటూ ఆయన ప్రజలను ప్రశ్నించారు. దీనికి కాదు..కాదు..కాదు..అని జనంలో నుంచి సమాధానం వచ్చింది. కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్నిన వారి పాపాలు పండి.. వచ్చే ఉప్పెనలో కొట్టుకుపోతారని హెచ్చరించారు. ఈ విధంగా జగన్ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తున్న సమయంలో ప్రజలూ అదే స్థాయిలో స్పందిం చారు. మేమున్నామంటూ నినాదాలు చేశారు. చివర్లో కాబోయే సీఎం..కాబోయే..కాబోయే సీఎం..అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన ప్రసంగంపై పలువురు ప్రశంసల జల్లులు కురిపించారు. 
 
ఓదార్పులో ప్రముఖులు

యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో 23 రోజుల పాటు నిర్వహించిన ఓదార్పుయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా చివరి రోజైన ఆదివారం కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు కొండా సురేఖ, మూలింటి మారెప్ప, సినీ నటి రోజా, సినీనటులు ధర్మవరపు సుబ్రమణ్యం, విజయ్‌చందర్, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, వైఎస్సార్ జిల్లా నాయకులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, కందుల రంగారెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వై.ఎస్.ఆర్. ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు శ్రీధర్‌రెడ్డి, మేకపాటి గౌతమ్, ఎమ్మెల్సీలు రెహమాన్, పుల్లా పద్మావతి, కొండా మురళి, ప్రకాశం జెడ్పీ చైర్మన్ కాటం అరుణమ్మ, డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పోలుబోయిన అనీల్‌కుమార్ యాదవ్, లాయర్ పత్రిక అధినేత తుంగా శివప్రభాత్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నెలవల సుబ్రహ్మణ్యం, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందిపాటి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ మాజీ ఛైర్మన్లు డేగా నారసింహారెడ్డి, బాలచెన్నయ్య, కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, అల్లాడి సతీష్ కుమార్‌రెడ్డి, వేమిరెడ్డి రవీంద్రరెడ్డి, మాజీ కార్పొరేటర్లు పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, తాటి వెంకటేశ్వర్లు, వేల్పుల రజని, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు జీవీ ప్రసాద్, ఇసనాక సునీల్‌రెడ్డి, మల్లు సుధాకర్‌రెడ్డి, కండ్లగుంట వెంకటేశ్వర్లురెడ్డి, కన్నపరెడ్డి అమరనాథ్‌రెడ్డి, అంకినపల్లి ఓబుల్‌రెడ్డి, కోనంకి శ్రీనివాసులునాయుడు, శివారెడ్డి, సాయిరాంరెడ్డి తదితరులు ఉన్నారు.

జగన్ అభిమన్యుడు కారు, పద్మవ్యూహం ఛేదించే అర్జునుడు: రోజా

కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అభిమన్యుడు కాడని, పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడని ప్రముఖ సినీ నటి రోజా అభివర్ణించారు. జగన్ పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడనీ పద్మవ్యూహంలోంచి బయటకు రాలేడని కొంత మంది అనుకుంటున్నారని, కానీ జగన్ పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడని ఆమె అన్నారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆదివారం జరిగిన ఓదార్పు ముగింపు సభలో ఆమె ప్రసంగించారు. పాదయాత్ర తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదిగినట్లు వైయస్ జగన్ తిరుగులేని నాయకుడిగా, ప్రజల మనిషిగా ఎదుగుతారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ వారసత్వం అందించే నాయకులు రాష్ట్రంలో లేరని, ఆ వారసత్వాన్ని వైయస్ జగన్ పుణికిపుచ్చుకున్నారని, తండ్రుల వారసత్వాన్ని తీసుకునేవారు చాలా కొద్ది మంది ఉంటారని, జగన్ ఆ వారసత్వాన్ని తీసుకున్నారని రోజా అన్నారు.

వైయస్ జగన్ ను చూసి ఓర్వలేక కొంత మంది జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. జగన్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. తండ్రి ఆస్తులకు వారసులుంటారు గానీ ఆశయాలకు వారసులుండరని, తండ్రి ఆశయాల సాధనను జగన్ వారసత్వంగా స్వీకరించారని ఆమె అన్నారు. వైయస్ ఆశయాల సాధనకు వైయస్ జగన్ ముందుకు వచ్చారని, అందుకు ప్రజలంతా సహకరించాలని ఆమె అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న జగన్ వేరేవారిని పంపించి బాధితులకు సహాయం అందివచ్చు కానీ ఆత్మీయ పలకరింపు కోసం, మీ కుటుంబంలో తానొకడిని అని చెప్పడానికి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారని ఆమె చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆమె అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర రాష్ట్రానికి, పార్టీకి మంచిదని ఆమె అన్నారు.