'సహనం నశిస్తున్నది' అంటున్న కడప ఎంపీ జగన్ వేరు కుంపటి పెట్టుకుంటే రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? బొటాబొటి మెజారిటీతో నెట్టుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏమిటి? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వారసుడిగా తెరపైకి రాబోతున్న జగన్ వెంట వెళ్లేది ఎందరు? కురు వృద్ధుడైన ముఖ్యమంత్రి రోశయ్యకు, హై కమాండ్‌కు అండగా ఉండేది ఎవరు?
మధ్యంతరం వస్తుందా? రాష్ట్రపతి పాలనతో ఆగుతుందా? అసలు... సర్కారు కుప్పకూలుతుందా? ఆపత్కాల 'సహచరుల' అండతో నిలబడుతుందా? ఇదీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ! ఎన్నో సమీకరణాలు, మరెన్నో సంభావ్యతలు!

రాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 294. స్పీకర్‌ను మినహాయిస్తే, ప్రభుత్వ మనుగడకు (కనీస మెజారిటీ) 147 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 156! అంటే మేజిక్ ఫిగర్ కంటే కేవలం 9 మంది మాత్రమే ఎక్కువ అన్న మాట! ఈ అత్తెసరు పరిస్థితే భవిష్యత్తు రాజకీయాన్ని అత్యంత ఆసక్తికరంగా మారుస్తోంది. ఏం జరుగుతుందన్న ఉత్కంఠను రేపుతోంది.

ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్న జగన్ , వేరుకుంపటి పెట్టుకోవడం అంటూ జరిగితే, తక్షణం రోశయ్య ప్రభుత్వాన్ని పడగొట్టడమే ఏకైక కార్యక్రమంగా పావులు కదుపుతారనడంలో ఎవరికీ సందేహాలు లేవు. ఎందుకంటే రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు దాదాపు నాలుగేళ్ల సమయం ఉంది. అప్పటిదాకా వేచిచూసే ఉద్దేశమే ఉంటే ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగేవారు.
రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటే తప్ప జగన్ వెంటనే సీఎం కావడం సాధ్యం కాదు. అది ఎలాగూ జరిగే పని కాదు కనుక, వెంటనే ప్రభుత్వాన్ని పడగొట్టి, మధ్యంతర ఎన్నికలను తెచ్చి, లక్ష్య సాధనకు ప్రయత్నించడమే జగన్ వ్యూహంగా భావించవచ్చు.

అయితే ప్రభుత్వాన్ని ఆయన పడగొట్టగలరా? మామూలుగానైతే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జగన్ తన వైపునకు తిప్పుకోగలిగితే ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం... ముగ్గురు ఇండిపెండెంట్లు, ఏడుగురు మజ్లిస్ సభ్యులు ఇప్పటికే కాంగ్రెస్‌కు సన్నిహితంగా మెలుగుతున్నారు.
ఇక 18 మంది సభ్యులున్న ప్రజారాజ్యానికి కూడా అధిష్ఠానం 'ముందు జాగ్రత్త'గా స్నేహహస్తం అందించి ఉంచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం నుంచి కనీసం 38 మందిని చీల్చగలిగితేనే రోశయ్య ప్రభుత్వాన్ని జగన్ మైనారిటీలో పడేయగలరు. ఈ క్రమంలోనూ ఇరువైపులా మళ్లీ అనేక ప్రశ్నలు, ప్రతిబంధకాలు. అవేమిటంటే....
ముగ్గురు స్వతంత్రులూ వైఎస్ హయాంలో కాంగ్రెస్ అనుబంధ సభ్యులుగా మారారు. వారిప్పుడూ కాంగ్రెస్ వైపే ఉంటారా? జగన్ వైపు తిరుగుతారా? స్వతంత్రులు ప్రభుత్వంవైపే ఉండడం సాధారణంగా కనిపించే పరిణామం. ఇక 18 మంది పీఆర్పీ ఎమ్మెల్యేల్లో కనీసం ఐదుగురు వైఎస్ కుటుంబానికి సన్నిహితులు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి వారు సర్కారుకు మద్దతిస్తారా?

కాకినాడలో గురువారం జగన్ నిర్వహించిన సభకు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సోనియా ఆమోదం లేకపోయినప్పటికీ, ఎందరు ఎమ్మెల్యేలు జగన్ వద్దకు వెళ్లడం కీలకమేనని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ను కాదని జగన్ ముందుకు నడిస్తే, ఆ పక్కకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే అంచనాలున్నాయి.
కాకినాడ సభకు వెళ్లిన వారిలో చాలామంది, 'ప్రజాదరణ కలిగిన' జగన్‌కు నైతిక మద్దతు మాత్రమే ఇస్తున్నారని, కాంగ్రెస్‌లోనే కొనసాగాల్సిందిగా ఆయనను కోరుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎక్కువమంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారే కావడం, పదవీ కాలం మరో మూడున్నరేళ్లు ఉండడం నేపథ్యంలో, జగన్ కోసం పార్టీతో తెగదెంపులు చేసుకోవడానికి, 'అధికారాన్ని' కోల్పోవడానికి, మళ్లీ ఎన్నికల బరిలో నిలబడడానికి వీరందరు సిద్ధపడతారా? పార్టీయే ముఖ్యమని వెనుదిరుగుతారా?
కాంగ్రెస్‌వాదిగా ఉంటేనే తమ మద్దతు లభిస్తుందని జగన్‌కు చెప్పాల్సిందిగా ఇటీవల కొందరు మంత్రులు యువ ఎమ్మెల్యేలకు కౌన్సెలింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కొందరు ఎమ్మెల్యేలు కాకినాడకు వెళ్లారని ప్రచారం కూడా జరుగుతోంది. అక్కడికి వెళ్లిన వారందరూ వేదికపై కనిపించకపోవడంపై కూడా పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఎక్కువ మంది మాట్లాడేందుకు అవకాశం లేదని, అలాంటివారు కింద కూర్చోవాలని, లేదా వెళ్లేవారు వెళ్లిపోవచ్చని కూడా అక్కడ చెప్పారని దీంతో కొందరు మీటింగ్‌కు ముందే వచ్చేశారనే చర్చ కూడా ఉంది. మరోవైపు బహిరంగ సభకు హాజరు కానప్పటికీ జగన్‌కు మద్దతుగా నిలిచే వారు కాంగ్రెస్ శాసనసభా పక్షంలో ఇంకొందరు ఉన్నారు. వీరందరి సంఖ్యా కనీసం 38ని దాటుతుందా?
ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే, నలుగురు సభ్యుల సీపీఐ, ఒక్కొక్క సభ్యుడున్న సీపీఎం, బీజేపీ, లోక్‌సత్తా ఎలాంటి వైఖరి తీసుకుంటాయి? కొత్తగా ఎన్నిక కాబోతున్న టీఆర్ఎస్ సభ్యులు ఏం చేస్తారు? జగన్ వేరు కుంపటి పెట్టుకుంటే టీఆర్ఎస్ కాంగ్రెస్‌తో కలుస్తుందన్న ప్రచారం సాగుతోందని టీఎన్జీవో నేత స్వామిగౌడ్ గురువారం కేసీఆర్ సమక్షంలోనే చెప్పారు.
'సోనియాకు నామీద అభిమానం ఉంది. ఆమె నాతో ఫోన్ చేసి మాట్లాడుతుంది అనేవి నిజమే కానీ అంటూనే టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో కలిసే అవకాశం లేదని పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం. ఇక 91 మంది సభ్యులున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఏం చేస్తుందన్నది మరో కీలక ప్రశ్న.
తప్పనిసరై సభలో అవిశ్వాసం వస్తే టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు కూడా రోశయ్య సర్కారు పడిపోకుండా సహకరిస్తారని, సభకు గైర్హాజరు అవుతారనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ మనుగడకు పరోక్షంగానైనా సహకరించాలని ఆయా పార్టీలుగానీ, వాటికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు గానీ నిర్ణయించుకుంటే, ఆ పరిస్థితిలోనూ సర్కాను పడగొట్టేంత బలాన్ని జగన్ సంపాదించుకోగలరా?
ఈ కీలక ప్రశ్నలకు సమాధానాలు రావడం అంత సులభం కాదు. జగన్ నుంచి ప్రమాదం అంచనా వేసినందునే అధిష్ఠానం చిరంజీవితో చర్చలు జరిపి ముందస్తు మద్దతు స్వీకరించిందని, మజ్లిస్ కూడా కాంగ్రెస్‌కు తోడ్పాటునందిస్తుందని.. అందువల్ల రోశయ్య ప్రభుత్వానికి ప్రమాదమేమీ ఉండదని ఢిల్లీ నేతలు ధీమాగా ఉన్నట్టు వారు చెబుతున్నారు.
"ఏడాదిన్నర కూడా కాకుండానే ఇప్పటికిప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి ఎమ్మెల్యేలు ఎవరూ సిద్ధంగా లేరు. ఒకవేళ ఉన్నారనుకున్నా, రోశయ్య సర్కారును పడగొట్టిన వెంటనే ఎన్నికలు వస్తాయన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలన విధించవచ్చు.

ఒకసారి రాష్ట్రం ప్రస్తుత గవర్నర్ పాలనలోకి వెళితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రాభవం పోగొట్టుకోక తప్పదు. చేజేతులా అధికారాన్ని కోల్పోయి, ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లా గోళ్లు గిల్లుకోవాల్సి ఉంటుంది'' అని పార్టీ నేత ఒకరు విశ్లేషించారు.
కాంగ్రెస్‌ను కాదంటే జగన్‌కు బలం పెద్దగా ఉండదని లెక్కలు వేస్తూనే అధిష్ఠానం ఇతర ఆలోచనలు కూడా చేస్తున్నది. వెంటనే ఎన్నికలకు సంసిద్ధంగా లేని ఇతర పక్షాలతో, సభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదింప జేసినట్లయితే, తర్వాత ఆరు నెలల దాకా బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరమే ఉండదని అది భావిస్తోంది.
జగన్ సొంత పార్టీ పెట్టుకుంటే, ఆయనతో జత కూడిన ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించి, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించడం మరో మార్గమని, మళ్లీ విశ్వాసం నిరూపించుకోవాల్సిన గడువులోగా వారు పదవులు కోల్పోతారని పార్టీ ముఖ్యులు లెక్క వేస్తున్నారు.

ఏదిఏమైనా ఈ రాజకీయాలు కాంగ్రెస్‌ను గందరగోళంలో పడేయడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 2న సీఎం రోశయ్య ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్ర రాజకీయాలపై అధిష్ఠానంతో ఆయన చర్చించే అవకాశం ఉంది.
