Sunday, November 7, 2010

జగన్ అభిమన్యుడు కారు, పద్మవ్యూహం ఛేదించే అర్జునుడు: రోజా

కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అభిమన్యుడు కాడని, పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడని ప్రముఖ సినీ నటి రోజా అభివర్ణించారు. జగన్ పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడనీ పద్మవ్యూహంలోంచి బయటకు రాలేడని కొంత మంది అనుకుంటున్నారని, కానీ జగన్ పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడని ఆమె అన్నారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆదివారం జరిగిన ఓదార్పు ముగింపు సభలో ఆమె ప్రసంగించారు. పాదయాత్ర తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదిగినట్లు వైయస్ జగన్ తిరుగులేని నాయకుడిగా, ప్రజల మనిషిగా ఎదుగుతారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ వారసత్వం అందించే నాయకులు రాష్ట్రంలో లేరని, ఆ వారసత్వాన్ని వైయస్ జగన్ పుణికిపుచ్చుకున్నారని, తండ్రుల వారసత్వాన్ని తీసుకునేవారు చాలా కొద్ది మంది ఉంటారని, జగన్ ఆ వారసత్వాన్ని తీసుకున్నారని రోజా అన్నారు.

వైయస్ జగన్ ను చూసి ఓర్వలేక కొంత మంది జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. జగన్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. తండ్రి ఆస్తులకు వారసులుంటారు గానీ ఆశయాలకు వారసులుండరని, తండ్రి ఆశయాల సాధనను జగన్ వారసత్వంగా స్వీకరించారని ఆమె అన్నారు. వైయస్ ఆశయాల సాధనకు వైయస్ జగన్ ముందుకు వచ్చారని, అందుకు ప్రజలంతా సహకరించాలని ఆమె అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న జగన్ వేరేవారిని పంపించి బాధితులకు సహాయం అందివచ్చు కానీ ఆత్మీయ పలకరింపు కోసం, మీ కుటుంబంలో తానొకడిని అని చెప్పడానికి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారని ఆమె చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆమె అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర రాష్ట్రానికి, పార్టీకి మంచిదని ఆమె అన్నారు.

No comments:

Post a Comment