Sunday, November 7, 2010

జన సునామీ * ఓదార్పుకు స్పందన అనూహ్యం

బంగాళాఖాతంలో‘జల్’పెను తుపాను.. తీరంలో అల్లకల్లోలం... జిల్లా వ్యాప్తంగా వర్షాలు... ఇది ఆదివారం ఉదయం పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ఓదార్పుయాత్ర ముగింపు కార్యక్రమం ఏ విధంగా జరుగు తుందోనని ఆయన అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ.

ఉదయం నుంచి మబ్బులు కమ్మిన ఆకాశం. అప్పుడప్పుడు కురుస్తున్న చిరుజల్లులు. సాధారణంగా వర్షం కురిస్తే మోకాటిలోతు నీళ్లు నిలిచే నెల్లూరు ప్రధాన రోడ్లు, వీధులు ‘జన’మయమయ్యాయి. వర్షం వస్తే బోసిపోయే రోడ్లపై ఎక్కడ చూసినా జనమే. జోరు వర్షంలోనూ కదలని జనం. కురుస్తున్న వర్షం చినుకులు రోడ్డు మీద పడని పరిస్థితి. ఇదీ ఆదివారం నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటరులో కనిపించిన దృశ్యాలు.

యువనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదివారం నెల్లూరులో చివరిరోజు ఓదార్పుయాత్రను నిర్వహించారు. అభిమానులు కడలి కెరటాల్లా తరలివచ్చి యువనేతకు నీరాజనం పలికారు. కటౌట్లు, ఫ్లెక్సీ బోర్డులు, భవనాలు, మిద్దెలు, దుకాణాలు, ట్రాఫిక్ డివైడర్లు, ఐల్యాండ్లు ఇలా ప్రతి చోటూ జనంతో నిండిపోయాయి. యువతనేతను ఆత్మీయంగా పలుకరించాలని ఉదయం నుంచి నగరవాసులు ఎదురుచూశారు, బొకేలు, పూలమాలలు చేతబట్టి రోడ్లపై చేరారు.
నెల్లూరు నగరంలోని మనోహర్‌రెడ్డి నివాసం నుంచి జిల్లాలో చివరి రోజు ఓదార్పుయాత్రను జగన్ ప్రారంభించారు. జగన్‌ను కలిసేందుకు వచ్చిన నాయకులు, అభిమానులతో మనోహర్‌రెడ్డి నివాసం కిక్కిరిసిపోయింది.

అక్కడకి వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగిన జగన్ నీలగిరి సంఘానికి చేరుకుని మహబూబ్‌బాషా కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్‌కు బయలుదేరిన జగన్‌పై అడుగడుగునా జనం అభిమానం కురిపించారు. చిరుజల్లులు కురుస్తున్నా జనం ఖాతరుచేయలేదు. విద్యార్థులు, యువకులు, చిన్నారులు, మహిళలు ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. మహిళలు జగన్‌కు దిష్టి తీయడంతో పాటు మంగళ హారతులిచ్చారు. అభిమాన బంధాలను దాటుకుంటూ జగన్ గాంధీబొమ్మ సెంటర్ సమీపంలోకి చేరుకున్నారు. అప్పటికే గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్‌సీ సెంటర్, కనకమహాల్ సెంటర్, ఏసీ సెంటర్‌ల వరకూ జనం కిటకిటలాడుతున్నారు. కనీవినీ ఎరుగనిరీతిలో తరలివచ్చిన జనం మధ్య జగన్ కాన్వాయ్ ముందుకు సాగడం కష్టతరంగా మారింది. ప్రతి ఒక్కరూ జగన్ చేతి స్పర్శ కోసం పోటీపడ్డారు. వాహనాన్ని విగ్రహావిష్కరణ వేదిక వద్దకు తీసుకెళ్లేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

జగన్ వేదికపైకి చేరుకోగానే ఆ ప్రాంతం కాబోయే సీఎం..జగన్ అనే నినాదాలతో హోరెత్తింది. అనంతరం నిలువెత్తు వైఎస్సార్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అప్పటికే వర్షం మొదలైనా జనం లెక్కచేయలేదు. జగన్ చేసిన ప్రసంగాన్ని వింటూ విశేషరీతిలో స్పందించారు. జగన్ ప్రసంగం మొదలైన సమయంలో తుంపర్లుగా పడుతున్న వర్షం ముగిసే సమయానికి జోరువానగా మారింది. అయినప్పటికీ జనం వెనకడుగు వేయకుండా ఆసక్తికరంగా సాగిన జగన్ ప్రసంగాన్ని విన్నారు.

చివర్లో సీఎం..సీఎం...సీఎం..సీఎం..అంటూ నినాదాలతో హోరెత్తించారు. నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, సినీ నటి రోజా, సినీనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి, అంబటి రాంబాబు. గట్టు రామచంద్రరావు, పుల్లా పద్మావతి, కాటం అరుణమ్మ, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, రెహమాన్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తదితరుల ప్రసంగాలకు కూడా జనం నుంచి విశేష స్పందన లభించింది. జోరువాన కురుస్తున్నా జగన్ అక్కడి నుంచి వెళ్లేంత వరకు జనం కదలకపోవడం విశేషం. అక్కడి నుంచి డైకస్‌రోడ్డు సెంటర్‌కు చేరుకుని వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడ ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు.

వర్షంలోనూ ప్రజలు హాజరుకావడంతో వారిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. వైఎస్సార్‌పై ఇంతటి ఆదరాభిమానాలను ప్రదర్శించడం హర్షణీయమన్నారు. సీఏఎం స్కూలు సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ వైఎస్సార్‌పై స్థానిక ముస్లింనేత ఆలపించిన గీతాన్ని జగన్ ఎంతో ఆసక్తిగా విన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జేకేరెడ్డి ఇంట్లో ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించారు. సన్నీ హైట్స్ హోటల్ అధినేత బలరామిరెడ్డి నివాసంలో భోజనానికి హాజరయ్యారు. అనంతరం నెల్లూరు నగర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు, వెంకటాచలం మండలం గొలగమూడి, అనికేపల్లి, తిక్కవరప్పాడులలో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి చెన్నైకు బయలుదేరారు.
నగరంలోని బట్వాడిపాళెం చర్చిలో జననేత ప్రార్థనలు చేశారు. తదుపరి కనుపర్తిపాడు వెళుతూ మార్గమధ్యలో మాజీ కౌన్సిలర్ మాథ్యుస్ కోరిక మేరకు కొండాయపాళెం బాప్టిస్టు చర్చి వద్ద ఆగారు. చర్చిలో ప్రార్థన చేసి మతపెద్దలు ఆశీస్సులు పొందారు. 
 
ఓదార్పుకు స్పందన అనూహ్యం
ఓదార్పుయాత్రలో భాగంగా యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లాలో ఓదార్పుయాత్ర ప్రారంభం నుంచి ప్రజల హృదయాలను తాకేలా ఆయన మాట్లాడారు. దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి చోటా ఆయన ప్రస్తావించారు. ఆ పథకాల పేర్లను ప్రస్తావించినప్పుడల్లా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. ఒక్కో పథకం పేరు చెబితే చాలు జనంలో నుంచి వైఎస్సార్..వైఎస్సార్..వైఎస్సార్ అని సమాధానం వచ్చేది.

దివంగత నేత వైఎస్సార్ మాదిరిగానే 108 వాహన సేవలను వివరించినప్పుడు ఆయన చెప్పే కుయ్..కుయ్..కుయ్ పదాలకు జనం కూడా శృతి కలిపారు. ప్రధానంగా జగన్ ఉచ్చరించే గుర్తుకొస్తూనే ఉంటారు...అనే మాటకు జనంలో నుంచి కేరింతలు వెల్లువెత్తాయి. ఆయన తన ప్రసంగాల్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి, పారిశ్రామికాభివృద్ధి, సంక్షేమ పథకాలు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, రెండు రూపాయలకే కిలోబియ్యం, పావలా వడ్డీకి రుణాలు, రుణమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలను వివరించినప్పుడు జనం మరొక్కసారి దివంగతనేత వైఎస్సార్‌ను గుర్తుచేసుకున్నారు.

జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్ విగ్రహా విష్కరణ కార్యక్రమాల్లో చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తమకు వైఎస్సార్ చేసిన మేలును వివరించేందుకు వేదికల మీదకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. తమకు రెండు నిమిషాలు అవకాశమిస్తే మహానుభావుడు వైఎస్సార్ చేసిన ఉపకారాన్ని వివరించి తృప్తి పడతామని కోరారు. జగన్ వారందరికీ అవకాశం కల్పించారు. అలా వారు చేసిన ప్రసంగాలకు జగన్‌తో పాటు జనం కూడా మురిసిపోయారు.
ముగింపు ప్రసంగం అదరహో..

ఓదార్పుయాత్ర ఆఖరురోజైన ఆదివారం నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహా విష్కరణ అనంతరం జగన్ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన ఓదార్పుయాత్రకు అడ్డంకులు సృష్టిస్తూ అవాకులు, చవాకులు పేలుతున్న వారిపై నిప్పులు చెరిగారు. కొండా సురేఖ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అంబటి రాంబాబు, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గట్టు రాంచంద్రరావులు ఏం చేశారని చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కుట్రలు, కుతంత్రాలతో జగన్‌ను ఒంటరి చేయలేరన్నారు. ప్రతిపక్షం కంటే స్వపక్షనేతలే తనపై అబద్ధాలు చెప్పి బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగన్‌ను ఒంటరి చేసేందుకు తనను నమ్ముకున్న వారిని పథకం ప్రకారం బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్టీలో ఉన్నవారికి నరకయాతన చూపిస్తున్నారన్నారు. ఇలా చేయడం న్యాయమా అంటూ ఆయన ప్రజలను ప్రశ్నించారు. దీనికి కాదు..కాదు..కాదు..అని జనంలో నుంచి సమాధానం వచ్చింది. కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్నిన వారి పాపాలు పండి.. వచ్చే ఉప్పెనలో కొట్టుకుపోతారని హెచ్చరించారు. ఈ విధంగా జగన్ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తున్న సమయంలో ప్రజలూ అదే స్థాయిలో స్పందిం చారు. మేమున్నామంటూ నినాదాలు చేశారు. చివర్లో కాబోయే సీఎం..కాబోయే..కాబోయే సీఎం..అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన ప్రసంగంపై పలువురు ప్రశంసల జల్లులు కురిపించారు. 
 
ఓదార్పులో ప్రముఖులు

యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో 23 రోజుల పాటు నిర్వహించిన ఓదార్పుయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా చివరి రోజైన ఆదివారం కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు కొండా సురేఖ, మూలింటి మారెప్ప, సినీ నటి రోజా, సినీనటులు ధర్మవరపు సుబ్రమణ్యం, విజయ్‌చందర్, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, వైఎస్సార్ జిల్లా నాయకులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, కందుల రంగారెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వై.ఎస్.ఆర్. ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు శ్రీధర్‌రెడ్డి, మేకపాటి గౌతమ్, ఎమ్మెల్సీలు రెహమాన్, పుల్లా పద్మావతి, కొండా మురళి, ప్రకాశం జెడ్పీ చైర్మన్ కాటం అరుణమ్మ, డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పోలుబోయిన అనీల్‌కుమార్ యాదవ్, లాయర్ పత్రిక అధినేత తుంగా శివప్రభాత్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నెలవల సుబ్రహ్మణ్యం, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందిపాటి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ మాజీ ఛైర్మన్లు డేగా నారసింహారెడ్డి, బాలచెన్నయ్య, కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, అల్లాడి సతీష్ కుమార్‌రెడ్డి, వేమిరెడ్డి రవీంద్రరెడ్డి, మాజీ కార్పొరేటర్లు పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, తాటి వెంకటేశ్వర్లు, వేల్పుల రజని, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు జీవీ ప్రసాద్, ఇసనాక సునీల్‌రెడ్డి, మల్లు సుధాకర్‌రెడ్డి, కండ్లగుంట వెంకటేశ్వర్లురెడ్డి, కన్నపరెడ్డి అమరనాథ్‌రెడ్డి, అంకినపల్లి ఓబుల్‌రెడ్డి, కోనంకి శ్రీనివాసులునాయుడు, శివారెడ్డి, సాయిరాంరెడ్డి తదితరులు ఉన్నారు.

జగన్ అభిమన్యుడు కారు, పద్మవ్యూహం ఛేదించే అర్జునుడు: రోజా

కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అభిమన్యుడు కాడని, పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడని ప్రముఖ సినీ నటి రోజా అభివర్ణించారు. జగన్ పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడనీ పద్మవ్యూహంలోంచి బయటకు రాలేడని కొంత మంది అనుకుంటున్నారని, కానీ జగన్ పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడని ఆమె అన్నారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆదివారం జరిగిన ఓదార్పు ముగింపు సభలో ఆమె ప్రసంగించారు. పాదయాత్ర తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదిగినట్లు వైయస్ జగన్ తిరుగులేని నాయకుడిగా, ప్రజల మనిషిగా ఎదుగుతారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ వారసత్వం అందించే నాయకులు రాష్ట్రంలో లేరని, ఆ వారసత్వాన్ని వైయస్ జగన్ పుణికిపుచ్చుకున్నారని, తండ్రుల వారసత్వాన్ని తీసుకునేవారు చాలా కొద్ది మంది ఉంటారని, జగన్ ఆ వారసత్వాన్ని తీసుకున్నారని రోజా అన్నారు.

వైయస్ జగన్ ను చూసి ఓర్వలేక కొంత మంది జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. జగన్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. తండ్రి ఆస్తులకు వారసులుంటారు గానీ ఆశయాలకు వారసులుండరని, తండ్రి ఆశయాల సాధనను జగన్ వారసత్వంగా స్వీకరించారని ఆమె అన్నారు. వైయస్ ఆశయాల సాధనకు వైయస్ జగన్ ముందుకు వచ్చారని, అందుకు ప్రజలంతా సహకరించాలని ఆమె అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న జగన్ వేరేవారిని పంపించి బాధితులకు సహాయం అందివచ్చు కానీ ఆత్మీయ పలకరింపు కోసం, మీ కుటుంబంలో తానొకడిని అని చెప్పడానికి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారని ఆమె చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆమె అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర రాష్ట్రానికి, పార్టీకి మంచిదని ఆమె అన్నారు.

Tuesday, November 2, 2010

ఎల్లల్లేని అభిమానం

పార్టీలకు అతీతంగా వైఎస్ విగ్రహాల ఏర్పాటు
అభిమాన ప్రవాహంలో కొట్టుకుపోతున్న ‘అడ్డంకులు’
విగ్రహావిష్కరణలకు అశేషంగా తరలివస్తున్న జనం
18వ రోజు ఓదార్పుకు అడుగడుగునా నీరాజనం



ప్రేమకు, అభిమానానికి ఎల్లలుండవు.. అందుకే వైఎస్.. పేదలపై తన అభిమానాన్ని సంక్షేమ పథకాల ద్వారా చాటుకున్నారు. ఏ పార్టీ కార్యకర్త అని చూడకుండా ప్రతి పేదోడికీ లబ్ధి కలిగేలా చేశారు. విపక్ష నియోజకవర్గమైనా అభివృద్ధికి లోటు లేకుండా నిధులిచ్చారు. దాంతో వైఎస్‌కు అభిమానులుగా మారిన ప్రజలిప్పుడు తమ అభిమానాన్ని విగ్రహాల ఏర్పాటు ద్వారా చాటుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా తమ ఆప్యాయతను కనబరుస్తున్నారు. దాన్ని ఏర్పాటు చేయడానికి అధికార పక్షం, స్వపక్షం నుంచి అడ్డంకులు ఎదురైనా అధిగమించి విజయం సాధిస్తున్నారు. అలా ఏర్పాటైనవాటిలో ఒక విగ్రహాన్ని యువనేత జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఓదార్పు యాత్రలో ఆవిష్కరించారు. అయితే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి జరిగిన పోరాటం చాలా ఉంది. దువ్వూరు గోపాలకృష్ణారెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు దాని కోసం చాలా కృషి చేశారు.

ఆయన భార్య శకుంతలమ్మ నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం ముల్లూరు గ్రామ సర్పంచ్. వైఎస్సార్ సంక్షేమ పథకాలతో ఈ ఊరు ఊరంతా బాగుపడింది. ఈ నేపథ్యంలో ముత్తుకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహం పెట్టాలని అనుకున్నారు. స్థానిక అగ్ర నాయకత్వం అంగీకరించ లేదు. అయితే గోపాల కృష్ణారెడ్డి రాజకీయాలు పక్కనబెట్టారు. మహానేత విగ్రహం పెడితే ఖర్చులు తాను భరిస్తానని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలను అర్థించారు. వారు ముఖం తిప్పుకున్నారు. గోపాల కృష్ణారెడ్డి తానే వైఎస్సార్ విగ్రహం పెట్టేందుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు సొంత పార్టీ అభ్యంతరం చెప్పింది. మానవత్వం లేని అభ్యంతరాలను తాను పట్టించుకోనని తెగేసి చెప్పారు. ముత్తుకూరు సెంటర్లో విగ్రహం పెట్టడం కోసం గ్రామ పంచాయతీ స్థలం అడిగారు.

అధికార మదం ఒప్పుకోలేదు. అదే సెంటర్‌కు కొద్ది దూరంలోనే ఉన్న తన సొంత స్థలంలో విగ్రహ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. భూమి పూజ చేశారు. ఆటంకాలు రెట్టింపయ్యాయి. అంతకు మించిన మానసిక ఒత్తిడి. భూమి పూజ చేసిన సరిగ్గా నాలుగు రోజులకు గోపాలకృష్ణారెడ్డి గుండె ఆగిపోయింది. విగ్రహ నిర్మాణం నిలిచిపోయింది. తండ్రి చివరి కోరికను ఆయన ముగ్గురు కొడుకులు భుజానికెత్తుకున్నారు. ఇబ్బందులను భరిస్తూనే విగ్రహ నిర్మాణం చేశారు. 18వ రోజు మంగళవారం ఓదార్పు యాత్రలో భాగంగా యువనేత జగన్ దాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘బతికి ఉన్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం గొప్ప కాదు. చనిపోయిన తరువాత ఎంతమంది గుండెల్లో బతికున్నామన్నదే గొప్ప’ అని అన్నారు. ప్రసంగించటానికంటే ముందు గోపాలకృష్ణారెడ్డి ఆత్మ శాంతి కోసం ఒక నిమిషం మౌనం పాటించారు. అదే వేదికపై గోపాలకృష్ణారెడ్డి పెద్ద కుమారుడు విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘జనం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జగన్‌ను వీడబోను’ అని ప్రమాణం చేశారు. ఈ విగ్రహావిష్కరణకు రాజకీయ పార్టీల నేతలెవరూ హాజరు కాలేదు. కాని ప్రజలు మాత్రం భారీ ఎత్తున పోటెత్తారు. యువనేతతో కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపారు. చేజర్ల మండలం నూతక్కివారి కండ్రిక, నేర్నూరు, ఉదయగిరి మండలం కొత్తపల్లి, లింగంనేనిపల్లి, దేపూరుపల్లి, కోవూరు పెద్దసాయిబాబా గుడిసెంటర్‌లలోనూ విపక్ష పార్టీల కార్యకర్తలు, నేతలే వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇటీవలే జగన్ వాటిని ఆవిష్కరించారు.
సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు కొత్తూరు చింతోపులో ఏల్చూరి నారయ్య కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం జగన్ ఇందుకూరు మండలం పోట్లపాడులో బసచేశారు. మంగళవారం పోట్లపాడు నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు.

ముంగళదోరువు మీదుగా పేడూరుకు చేరుకుని దళిత వాడలో దువ్వూరి రామయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడి నుంచి యాత్ర పాపిరెడ్డిపాలెం, తోటపల్లిగూడూరు, వరిగుండం, ముత్తుకూరు, సుబ్బారెడ్డిపాలెం, పంటపాలెం గ్రామాల మీదుగా రాత్రి ఏడు గంటలకు దొరువుల పాలెం పంచాయతీలోని రొయ్యలపాలెం చేరుకుంది. ఇక్కడ జగన్ నెల్లిపూడి వెంకటయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం వెంకటాచలం మండలం నిడుగుంటపాలెం మీదుగా రాత్రి 11 గంటలకు సర్వేపల్లి చేరుకున్న యువనేత అక్కడ వర్షంలో తడుస్తూనే విగ్రహావిష్కరణ చేశారు. అక్కడి నుంచి 11:45 గంటలకు పూడిపర్తి గ్రామం చేరుకున్నారు. ఇక్కడ రాత్రి 12 గంటలకు సారంగం సురేష్ కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత కూడా ఓదార్పు యాత్ర కొనసాగింది.

చిన్న పల్లెలో ‘పెద్ద మనసులు’...

మంగళవారం ఓదార్పు యాత్ర పూర్తిగా పల్లెల్లోనే కొనసాగింది. చిన్న చిన్న పల్లెలు అయినప్పటికీ ప్రజలు మాత్రం భారీ ఎత్తున హాజరయ్యారు. యువనేత వస్తున్నారని ముందే తెలియడంతో ప్రజలు పనులు వదిలేసి జగన్ కోసం ఎదురుచూశారు. వృద్ధులు లేని సత్తువ కూడదీసుకొని గంట ముందే విగ్రహావిష్కరణ వేదిక వద్దకు వచ్చారు. కుటుంబ సమేతంగా ఎదురు వెళ్లి ఆయనకు ఘనస్వాగతం పలికారు. దాదాపు అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తమతమ ప్రిన్సిపాళ్ల అనుమతితో ఐచ్ఛిక సెలవులు తీసుకున్నారు. జగన్ ఆటోగ్రాఫ్ కోసం వారు ఎగబడ్డారు. ప్రతి విద్యార్థికీ కూడా జగన్ ఓపిగ్గా ఆటోగ్రాఫ్ ఇచ్చారు.

జగనన్నకు జై..జై..జై..జై...
ముంగళదోరువు గ్రామంలో జగన్ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం పూర్తికాగానే అన్నా నేను మాట్లాడుతా అంటూ శివయ్య అనే బాలుడు మైకు అందుకున్నాడు. ‘నాన్న గారికి యాక్సిడెంటు అయింది. రెండు కాళ్లు పోయాయి. రాజశేఖరరెడ్డిగారు ఆరోగ్యశ్రీ పెట్టారు. మా నాన్నకు కాళ్లు వచ్చాయి. నడుస్తున్నారు. జగనన్నకు జై...జై..జై.. అంటూ ఘంటాపథంగా అరవడం మొదలు పెట్టాడు. ఎవరు వారించినా బుడతడు వినలేదు, నేతలు మైకు లాక్కునేందుకు ప్రయత్నించినా వాడు చిక్కలేదు. జై..జై..జై..’ అంటూనే వేదిక దిగిపోయాడు.

ఆయన పుణ్యం...

ముత్తుకూరులో వైఎస్‌విగ్రహావిష్కరణ అనంతరం.. 85 ఏళ్ల షేక్ నాజ్‌నిషాబేగం కర్ర పొడుచుకుంటూ వేదిక మీదకు వచ్చింది. నేను మాట్లాడుతా మనవడా అంటూ జగన్ వద్ద నుంచి మైకు తీసుకుంది. ‘నాయినా ఆ అయ్య బతికుంటే నాకు *500 పింఛను ఇచ్చు. నాయిన పుణ్యం ఇదిగో ఇల్లు కట్టుకున్న. నా నాయిన వచ్చిండు’ అంటూ జగన్‌ను ముద్దు పెట్టుకుంది.

మంగళవారం జగన్ వెంట ఓదార్పులో పాల్గొన్న వారిలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, చిత్తూరు జిల్లా సత్యవీడు మాజీ ఎమ్మెల్యే నారాయణ స్వామి, కర్నూల్ జిల్లా నేతలు గౌరు వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్‌రెడ్డి, విజయా డైరీ చైర్మన్ చిల్లకూరి సుధీర్‌రెడ్డి, స్థానిక ‘లాయర్’ పత్రిక సంపాదకులు తుగా శివప్రభాత్‌రెడ్డి, పీఆర్పీ యువరాజ్యం జిల్లా అధ్యక్షుడు బట్టెపాటి నరేందర్‌రెడ్డి, స్థానిక నాయకులు టంగుటూరి శ్రీనివాసరెడ్డి, సాయికృష్ణారెడ్డి పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

ఆ బాధ నాకు తెలుసు...

రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక పేడూరు అరుంధతీయకాలనీలో మరణించిన దువ్వూరి రామయ్య కుటుంబ సభ్యులను జగన్ మంగళవారం ఓదార్చారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే ఎంత బాధ, కష్టమో తనకు తెలుసునని, ఏ కష్టమొచ్చినా తాను ఆదుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. అవసరమైనప్పుడు తనకు ఫోన్ చేయాలంటూ వారికి ఫోన్ నంబర్ ఇచ్చారు. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని రామయ్య భార్య కామాక్షమ్మకు సూచించారు. యువనేత జగన్ తమ కుటుంబ సభ్యులను ఓదార్చడం మర్చిపోలేని విషయమని కామాక్షమ్మ, రామయ్య తల్లి మరియమ్మ ‘న్యూస్‌లైన్’తో అన్నారు. ఆయన భరోసాతో తమ కుటుంబానికి కొండంత అండ దొరికిందన్నారు.

ఆన్ని విధాల ఆదుకుంటా..

మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లిపూడి వెంకటయ్య కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక దొరువుల పాలెం పంచాయతీలోని రొయ్యలపాలెంలో చనిపోయిన వెంకటయ్య ఇంటికి జగన్ మంగళవారం రాత్రి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటయ్య భార్య మస్తానమ్మ, కుమార్తె విజయతో మాట్లాడుతూ.. మీ కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చినా ఫోన్ చేయవచ్చని తన ఫోన్ నంబరు ఇచ్చారు.

Tuesday, August 24, 2010

మీఅందరి మధ్యలో పెరిగినోణ్ని .. తిరిగినోణ్ని..

 పులివెందుల్లో నేను మీ అందరి మధ్యనే పెరిగినోణ్ని ... మీ అందరి మధ్యనే తిరిగినోణ్ని... మీ ఆప్యా యత వల్లే చిరునవ్వుతో మీ ముందుకు వచ్చానని ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ జగన్ సోమవారం పులివెందుల నియోజక వర్గంలో ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ముందుగా ఆయన ఇడుపులపాయ నుండి పులివెం దులకు చేరుకుని ఓ పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. అనంతరం కడప రహదారిలోని రింగు రోడ్డు కూడలిలోను, బస్టాండ్ సర్కిల్ సమీపంలోను, పార్నపల్లె రహదారి సమీపంలోని రింగు రోడ్డు సర్కిళ్ల్ల వద్ద ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహాలను ఆయన ఆవిష్కరిం చారు.

ఈ సందర్బంగా మాట్లా డుతూ పులివెందుల పట్టణానికి నలువైపులా నాన్న విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓదార్పు యాత్రలో భాగంగా రాష్ట్రంలో ఎన్నో జిల్లాల్లో తిరిగినా. కానీ ఇక్కడ మీరు చూపుతున్న ప్రేమ , అభిమానం, ఆప్యాయతలే నన్ను మీ ముందుకు చిరునవ్వుతో నిలిపాయన్నారు. మీ ఆప్యాయతకు, ఆదరాభిమానాలకు చేతులెత్తి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి అందించిన ప్రేమానురాగాలను నాపై కూడా చూపించాలని అభ్యర్థిస్తున్నానన్నారు.

గత 9 నెలలుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రతి ఒక్కరికీ తెలుసు ను. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పత్రికల్లో , టీవీల్లో చూస్తున్నారన్నారు. పట్టణ శివార్లలో విగ్రహాల ఏర్పాటుకు ఇంత మంది ఏకమయ్యారంటే వైయస్ ఎక్కడు న్నారనే ప్రశ్నకు ప్రతి గుండెలో వైయస్ ఉన్నారన్నారు. ఇక్కడి వారి అందరి గుండె లబ్‌డబ్ లబ్‌డబ్ అని కొట్టుకోవడం లేదని, ప్రతి గుండె వైయస్సార్ వైయస్సార్ అంటూ కొట్టుకుంటోందన్నారు.

అనంతరం జగన్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నల్లపు రెడ్డిపల్లె మీదుగా జగన్ ఓదార్పు యాత్ర సాగింది. నల్లపు రెడ్డిపల్లెలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. నల్లగొండు వారిపల్లె మీదుగా వెళుతున్న జగన్ కాన్వాయ్‌ను ఆపి జగన్‌కు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయనకు ఆ గ్రామస్థులు సమస్యలను విన్నవించారు. అనంతరం అంబక పల్లె గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామ ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలన్నీ జగన్ ఓర్పుతో విన్నారు. అనంతరం మురారిచింతల , దిగువపల్లె, ఎగువ పల్లె, పార్నపల్లె తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. 


జగన్ వెంట ఆరుగురు ఎమ్మెల్యేలు
ఓదార్పు యాత్రలో కడప జిల్లా రాజంపేట, రాయచోటి, బద్వేల్, రైల్వే కోడూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కమలమ్మ, కొరముట్ల శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డిలతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన గురునాథ రెడ్డిలు పాల్గొన్నారు.

వీరితో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అహ్మదుల్లా కుమారుడు అష్రఫ్ కూడా జగన్‌ను కలిసి వెళ్లారు. తాను రాజమండ్రికి వెళ్తున్నానని జగన్‌కు ముందే చెప్పానని.. ఆయన ఆమోదం పొందానని.. మంగళవారం నుంచి ఓదార్పులో పాల్గొంటానని మంత్రి అహ్మదుల్లా ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రిగా ముఖ్యమంత్రి అనుమతిని తీసుకుంటారా.. లేక.. జిల్లా ఎంపీ ఆమోదం పొందుతారా? అనే సందేహం పార్టీలో నెలకొంది.

ప్రకాశం జిల్లా పర్యటన గురించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడిన ముఖ్యమంత్రి రోశయ్య.. ఇప్పుడు అహ్మదుల్లాతోనూ మాట్లాడతారా అనేది అసక్తికరంగా మారింది. జడ్పీ చైర్మన్ జ్యోతిరెడ్డి, డీసీసీబీ చైౖర్మన్ పల్లం బ్రహ్మానంద రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సురేష్‌బాబు, పులివెందుల మునిసిపల్ చైర్‌పర్సన్ రుక్మిణిలు కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఆయన జగన్ కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డిలు కూడా ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.

జగన్ బాబాయి.. ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి మొదటి రోజు ఓదార్పు యాత్రలో కనిపించలేదు. ఇటీవల సోనియాకు రాసిన లేఖ రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో ఆయన గైర్హాజరు చర్చనీయాంశమైంది. అయితే.. అమెరికాలో కూడా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నందున ఆ ఏర్పాట్ల కోసం హైదరాబాద్ వెళుతున్నానని ముందు రోజే వివేకా చెప్పారు. జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యులు డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డిలు ఓదార్పునకు దూరంగా ఉన్నారు. కోస్తాతో పోలిస్తే సొంత జిల్లాలో ఓదార్పునకు అంతస్థాయిలో జన స్పందన కనిపించలేదు.

నలుగురికి ఓదార్పు
మొదటి రోజు నాలుగు కుటుంబాలను జగన్ ఓదార్చారు. పులివెందుల్లో దేరంగుల జయరామ్ అనే వ్యక్తి వైఎస్ మృతి చెందిన ఆరు రోజుల తర్వాత చనిపోయారు. అలాగే అంబకపల్లెలో లోమడ వెంగముని అనే వృద్ధ్దుడు వారం తర్వాత చనిపోయాడు. ఈ ఇద్దరి కుటుంబాలను జగన్ పరామర్శించారు. అలాగే దిగువ పల్లెలో చాపల వెంకటరమణ అనే వ్యక్తి కుటుంబాన్ని, పార్నపల్లెలో మృతి చెందిన అంకె పుల్లన్న అనే వ్యక్తి కుటుంబాలను కూడా జగన్ ఓదార్చారు. వీరితోపాటు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మరో నలుగురి కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు.

ఓపిగ్గా, ఓర్పుగా సాగిన ఓదార్పు
పులివెందులలో జగన్ ఓదార్పు యాత్ర ఓర్పుగా, ఓపిగ్గా సాగింది. ఉదయం 8.30 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒకటిన్నరకు పూర్తి కావాల్సి ఉండగా 10.30 గంటలకు మొదలై రాత్రి 7.30 గంటలకు కూడా పార్నపల్లెకు చేరుకోలేక పోయారు. ఆలస్యం కావడంతో వేముల ఓదార్పును రద్దు చేసుకున్నారు. మార్గమధ్యంలో వివిధ గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

పెద్దకుడాలలో జిలిటెన్‌స్టిక్స్ లభ్యం
ఓదార్పు యాత్రకు ముందుగా లింగాల మండలం పెద్దకుడాలలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా పెద్దకుడాలలో వైఎస్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. దీనికి కొన్ని గంటల ముందే విగ్రహం ఏర్పాటు చేసిన సమీప ప్రాంతంలో 52 జిలిటెన్‌స్టిక్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఏఎస్పీ కార్తికేయన్ పరిశీలించారు. పలు కోణాల్లో వీటిపై పరిశీలన చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Sunday, August 22, 2010

రెచ్చగొట్టే ధోరణి ?

Jagan9
కడప ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శిబిరానికి చెందిన నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తున్నారంటూ పార్టీలో విమర్శలు గుప్పుమంటున్నా యి. మరో వైపు జగన్‌ శిబిరం నేతల వైఖరి చూస్తుంటే ఈ విమ ర్శ లకు బలం చేకూరుతున్నది. ఓదార్పు యాత్రకు బ్రేకు వేసేం దుకు పార్టీ అధిష్ఠానం ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు ఎవరూ కూడా యాత్రలో పాల్గొనవద్దంటూ నేతల ద్వారా తమ వైఖరి స్పష్టం చేసిన నేపథ్యంలో జగన్‌ శిబిరం దాన్ని తిప్పి కొట్టేందుకు రంగంలో దిగింది. ఓదార్పు యాత్రలో పాల్గొనకుంటే, యాత్ర ను వ్యతిరేకించినా జనం రాళ్ళతో కొడతారంటూ తాజాగా ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలపై ఒత్తిడి పెంచడానికి సరికొత్త తరహా ప్రచారాన్ని ప్రారంభించింది. తద్వారా ఓదార్పును వ్యతిరేకిస్తున్న వారిని, ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంలో ఊగిసలాడు తున్న వారికి జనం భయం చూపించి యాత్రకు రప్పించే ప్రయ త్నాలను ఆ శిబిరం ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అప్పటికి యాత్రకు రాని నేతలపై కార్యకర్తల రూ పంలో తమ వర్గం క్యాడర్‌ను రెచ్చగొట్టి, దాడులు చేయిం చేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

తాజాగా ఆదివారం ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొండా సురేఖ తదితరులు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జగన్‌ ఓదార్పు యాత్రను వ్యతిరేకిస్తున్న ప్రజా ప్రతినిధులపై పార్టీ ద్వితీయశ్రేణు నేతలు, క్యాడర్‌ను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పలువురు నేతలు విమర్శించారు. కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి ద్వారా అధిష్ఠానం ఓదార్పు యాత్ర విషయంలో ఇచ్చిన సంకేతాలు జగన్‌ వర్గానికి ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. హైకమాండ్‌ పేరుతో పురంధేశ్వరి మాట్లాడటమేమిటి, యాత్ర విషయంలో అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలనుకుంటే పార్టీ అధికార ప్రతినిధులు, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శుల ద్వారా విడుదల చేస్తుందని, అలా కాకుండా పురంధేశ్వరి ద్వారా ఓదార్పు యాత్రకు ఆదేశాలివ్వాల్సిన కర్మ పార్టీకి పట్టలేదని ఇప్పటికే జగన్‌ శిబిరం నిప్పులు చెరిగింది. దగ్గుబాటి దంపతులే ఓదార్పును అడ్డుకునేందుకు ఈ వ్యూహం వేశారని ఆరోపించింది. కాగా సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ చెప్పమన్న విషయాలను మాత్రమే తాను చెప్పడం జరిగిందని, పైగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఎదుట హైకమాండ్‌ ఓదార్పు యాత్రపై తన వైఖరి స్పష్టం చేసిందని పురంధేశ్వరి ఆదివారం వైజాగ్‌లో స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎంపి పనబాక లక్ష్మి కూ డా స్పందిస్తూ ఓదార్పు యాత్ర పార్టీకి లాభమా? నష్టమా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని, తాను మాత్రం యాత్ర కు వెళ్ళేది లేదని, ఇప్పటికే తన వైఖరి స్పష్టం చేశాను, ఇక పదే పదే దీనిపై మాట్లాడాల్సిన అవసరం లేదని ఆమె ఆదివారం తేల్చి చెప్పారు.

ఒక వైపు అధిష్ఠానం యాత్రకు వెళ్ళొద్దంటూ ఆదేశించినట్లు వార్తలు రావడం, మరో వైపు ప్రకాశం జిల్లాకు చెందిన ఎంపీలు, మరి కొందరు ఎమ్మెల్యేలు తాము అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, అందుకే యాత్రకు వెళ్ళబోమని స్పష్టం చేయడంతో జగన్‌ శిబిరం ఆందోళనలో పడింది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను సక్సెస్‌ చేయడానికి, అధిష్ఠానం కల్పిస్తున్న అడ్డంకులను అధిగమించేందుకు జగన్‌ శిబిరం సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ‘ఓదార్పు యాత్రకు వెళ్ళక పోతే జనం రాళ్ళతో కొడతారు’ అనే సరికొత్త నినాదాన్ని జగన్‌ శిబిరం తెరమీదకు తీసుకొచ్చి బహుళ ప్రచారం సాగిస్తోంది. ‘90 శాతం మంది వైఎస్‌ అభిమానులు ఉన్నారు, వైఎస్‌ను వ్యతిరేకించినా, ఓదార్పు యాత్రను వ్యతిరేకించినా జనం సహించే పరిస్థితుల్లో లేరు, రాళ్ళతో కొట్టే పరిస్థితి ఉంది’ అని ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించడం, ‘ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని పార్టీ హైకమాండ్‌ స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు.

ఈ యాత్రకు వెళ్ళక పోతే ప్రజలు నిలదీస్తారు. రాళ్ళతో కొడతారు. యాత్రను వ్యతిరేకించే నేతలకు కనిగిరి ఎమ్మెల్యేకు పట్టిన గతే పడుతుంది’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ నెల్లూరులో చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టడం ద్వారా ఓదార్పుకు దూరంగా ఉండే ప్రజా ప్రతినిధులపై ఉసిగొల్పే వ్యూహంలో ఇది భాగమేనని పార్టీ నేతలు కొందరు భగ్గుమంటున్నారు. ఢిల్లీ వెళ్ళి అహ్మద్‌ పటేల్‌తో కలిసి వచ్చిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలలో సభ్యుడైన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంలో తమ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ మేరకు రెండు రోజుల క్రితం తన నియోజకవర్గం కనిగిరిలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయం తెలుసుకున్నా రు.

జగన్‌ శిబిరం నేతలు, కార్యకర్తలుగా చెబుతున్న వారు యాత్రకు వెళ్ళవలసిందే నని పట్టుబట్టి ఒక దశలో ఎమ్మెల్యేపై దాడికి దిగినంత పనిచేశారు. దీంతో ఇదే ఘటన ను జగన్‌ శిబిరం తెరపైకి తీసుకొచ్చి విస్తృత ప్రచారం సాగిస్తూ ప్రజాప్రతినిధుల్లో భయాందోళనలు కల్పిస్తున్నదనే కొందరు నేతలు విమ ర్శిస్తున్నారు. మరో వైపు ఓంగోలు ఎంపి మేకపాటి రాజ్‌మోహ న్‌రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాము జగన్‌ యాత్రలో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మరో వైపు జగన్‌ శిబిరం ఓదార్పు యాత్రలో పాల్గొనాలంటూ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెంచడా నికి వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు చేపట్టింది. అనం తపురం, ఖమ్మం జిల్లాల్లో జగన్‌ శిబిరం నేతలు ఓదార్పు యాత్ర కు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. అనంతపు రంలో రఘువీరాను సైతం ఘెరావ్‌ చేసినంత పనిచేశారు.

విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ మరో అడుగు ముందుకు వేసి జగన్‌కు బాసటగా నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను జిల్లాకు ఒకటి చొప్పున ఆవిష్కరించాలంటూ హైకమాండ్‌ ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి ద్వారా అహ్మద్‌ పటేల్‌ ఇదే చెప్పించారు. అంతే కాకుండా జిల్లాల్లో వైఎస్‌ విగ్రహాం ఆవిష్కరించే చోటనే బాధితులను పిలిపించి ఆర్ధిక సహాయం చేయాలని ఆయన సూచించారు. అయితే హైకమాండ్‌ సూచనలను లగడపాటి వ్యతిరేకించడమే కాకుండా పరోక్షంగా జగన్‌ కు బాసటగా నిలిచిచారని పార్టీ వర్గాల్లో విమర్శలు భగ్గుమన్నాయి.

కౌంట్‌డౌన్‌ ! బల సమీకరణ మొదలు...

Sonia-gandhi
కాంగ్రెస్‌లో ఇక ఇమడగలిగే పరిస్థితులు కనిపించటం లేదని నిర్ధారణకు వచ్చిన కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తు న్నారా? ఆ పార్టీకి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ పేరు కానీ, ఇందిరాగాంధీ పేరు కానీ ఖాయం చేయబోతున్నారా?...కాంగ్రెస్‌ వర్గాలలో ఆసక్తిరంగా సాగుతున్న చర్చ ఇది. పార్టీ నుంచి జగన్‌ పోతే పోనీ అని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ ఘాటైన వ్యాఖ్యలు చేసినా బెదరని జగన్‌ సోమ, మంగళవారాలలో తన తండ్రి అనాదిగా ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం తల్లిగారైన విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్న పులి వెందుల నియోజకవర్గం నుంచి రెండురోజుల పాటు ఓదార్పు యాత్ర జరపబోతున్నారు.

జగన్‌ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవంటూ ప్రణబ్‌ తొలిసారిగా ఘాటైన హెచ్చరిక చేసినా పట్టించుకోకుండా తన ప్రయ త్నాలు తాను చేసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకత్వం తనపై చర్య తీసుకున్నా, లేకపోయినా కొత్త పార్టీ స్థాపించి ఎఐసిసికి తన దెబ్బ ఏమిటో రుచి చూపించాలన్న ధోరణి జగన్‌లో కనిపిస్తున్నదని పార్టీ వర్గాలు చెబు తున్నాయి. అయితే అధిష్ఠానం మాత్రం నోటి మాటలుగా తప్ప జగన్‌ విషయంలో చేతల్లో ఏ తీవ్రమైన చర్యా తీసుకోవటం లేదు. జగన్‌ ము న్ముందు ఏమి చేయబోతున్నారో తేలిన తర్వాతనే ఏదైనా నిర్ణయించాలని హై కమాండ్‌ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

పార్టీ ఏర్పాటు జరిగితే...
ఒకవేళ జగన్‌ ఊహాగానాలను నిజం చేస్తూ స్వంతంగా పార్టీ పెట్టాలనుకుంటేదాని నామకరణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రెండుసార్లు ఒంటి చేత్తో అధికారంలోకితీసుకు వచ్చిన తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలా? లేక అనాదిగా తమ కుటుంబం నమ్ముకుని ఉన్న కాంగ్రెస్‌కు మకుటం లేని మహారాణిలా వెలిగిన ఇందిరాగాంధీ పేరు పెట్టాలా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇందిరాకాంగ్రెస్‌ అనే పేరు ఖాయం చేయటానికి కొన్ని ఇబ్బందులున్నాయని ఆంతరంగికులు చెబుతున్నట్టు తెలిసింది.

jagan-speach
ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా ప్రతి బహిరంగ సభలో ఇందిర పేరును ప్రస్తావించకుండా ఉపన్యాసాన్ని కొనసాగించని నేపథ్యంలో ఇందిర పేరును తాము వాడుకుంటే రాజకీయంగా పెద్ద ప్రయోజనం ఉండదన్న ఆలోచనను కొందరు అనుయాయులు జగన్‌ వద్ద బయట పెట్టినట్టు చెబుతున్నారు. ఎలాగూ వైఎస్‌ పేరిటనే ఓదార్పు యాత్ర చేస్తున్నారు కాబట్టి పార్టీ పేరును సైతం ఆయన పేరుతోనే కొనసాగిస్తే రాజకీయంగా మనుగడ ఉంటుందన్న ఆలోచన అనుయాయుల నుంచి వస్తున్నట్టు తెలిసింది. పైగా ఈ తరం వోటర్లకు సోనియాగాంధీ తప్ప ఇందిర అంతగా తెలియకపోవ చ్చునని, అలాంటప్పుడు ఆమె పేరు పెడితే మరోరకమైన ఇబ్బంది ఎదురు కావచ్చునని కొందరు జగన్‌తో మాట్లాడినప్పుడు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు.

సెప్టెంబర్‌లో సంక్షోభమేనా?
జగన్‌ తీసుకునే ఏ నిర్ణయం అయినా కాంగ్రెస్‌లో సంక్షోభం సృష్టించక తప్పదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జగన్‌ పార్టీ నుంచి బయటకు వెళ్తే ఆయన వెంట ఏమేర ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్తారన్న దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ జగన్‌ గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలను చీల్చుకుపోతే రోశయ్య సర్కారు భవితవ్యం ఎలా ఉంటుందన్న చర్చ సైతం పార్టీ వర్గాలో జోరుగానే సాగుతున్నది. అంటే తన తండ్రి ప్రథమ వర్ధంతి వచ్చేనెల రెండున జరగనున్న నేపథ్యంలో ఆ రోజు కానీ, ఆ తర్వాత కానీ జగన్‌ తీసుకునే ఏ నిర్ణయం అయినా పార్టీలో సంక్షోభానికి తెర తీయక తప్పదన్న ఊహాగానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

వచ్చేనెలలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జరపబోయే ఓదార్పు యాత్రకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖరరెడ్డి, మరి కొందరు నేతలు బహిరంగంగా మద్దతు పలికారు. ఓదార్పు యాత్ర ఏర్పాట్లన్నీ బాలినేని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. యాత్ర జరపటం ఖాయం అని, ఇష్టం ఉన్న వారు రావచ్చునని, లేనివారు రాకపోయినా బలవంతం ఏమీ లేదని బాలినేని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో తనను కలిసిన నేతలకు జగన్‌ సైతం ఇదే మాట చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ లెక్కన పార్టీలో పెను సంక్షోభం సృష్టించి తన సత్తా ఏమిటో కాంగ్రెస్‌ నాయకత్వానికి చూపించాలని జగన్‌ వ్యూహ రచన చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సోమ, మంగళ వారాలలో స్వంత జిల్లాలో జరిపే ఓదార్పు యాత్ర సందర్భంగా తనకు అనుకూలురైన ఎమ్మెల్యేలతో భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

బల సమీకరణ మొదలు...
ఢిల్లీ వెళ్ళి అధిష్ఠానం మనుషులతో మాట్లాడిన తర్వాత ఇక తనను పార్టీ పట్టించుకునే స్థితిలో లేదని నిర్ణయానికి వచ్చినజగన్‌, శనివారం తన మద్దతుదారులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు ముసిరేలా దగ్గుబాటి దంపతులు చేశారని ఆగ్రహంగా ఉన్న జగన్‌, తన మనుషులతో వారిపై కారాలు, మిరియాలు నూరిస్తున్నారు. వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి లాంటి వారి ద్వారా కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరిని, మరో మంత్రి పనబాక లక్ష్మిని తీవ్రంగా విమర్శించేలా చేస్తున్నారు.

అలా చేస్తూనే మరోవైపు ప్రముఖులు అనుకున్న వారితో స్వయంగా మాట్లాడి అనుకూలంగా మలచుకుంటున్నారు. అలా రోజు రోజుకూ తనకు మద్దతు దారులు పెరిగేలా చూసుకుంటున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ రంగ ప్రవేశం చేశారు. ఓదార్పు యాత్ర విషయంలో కానీ, మరో అంశంపై కానీ ఎక్కువగా వ్యాఖ్యలు చేయని లగడపాటి, హఠాత్తుగా తెరపైకి వచ్చి జిల్లాకు ఒక వైఎస్‌ఆర్‌ విగ్రహం ఉంటే సరిపోతుందని అధిష్ఠానం చెప్పినట్టు వచ్చిన వార్తలపై మండి పడ్డారు. అది సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి యాత్రకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో లగడపాటి అదనంగా జగన్‌కు అండగా మిగిలారు.

హడావుడి లేకుండానే...
తన పట్ల అధిష్ఠానం అనుసరిస్తున్న వైఖరికి రగిలిపోతున్న జగన్‌ ఎలాంటి హడావుడీ లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఏమి చేస్తున్నదీ పది మందికి తెలియకుండా అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నా రు. ప్రతి జిల్లాలో తన వారెవరో, పరాయివారెవరో అంచనాలు వేసుకుంటున్నారు. తన సర్వేలు తనకు ఉన్నాయని ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలతో కొద్ది రోజుల క్రితమే చెప్పిన ఆయన వాటి ప్రకారమే తన బలం ఎంతో, స్థాయి ఏమిటో అంచనాలు వేసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో సెప్టెంబర్‌ మాసం కాంగ్రెస్‌ పార్టీ పాలిట సంక్షోభ మాసం అవుతుందా? సామరస్యంగా ముగుస్తుం దా అనేది చూడాల్సి ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కొందరు అభిప్రాయపడ్డారు.

అధిష్ఠానం చెప్పిందే చెప్పా - పురంధేశ్వరి
D.Purandhareswar
ఓదార్పు యాత్రపై వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పలేదు, రాష్ట్ర నేతలందరి సమక్షంలో అహ్మద్‌ పటేల్‌ ఏం మాట్లాడారో అదే మీడియాకు చెప్పా.

రోశయ్య సర్కారుపై కుట్ర - జి. వెంకటస్వామి
venkataswami
రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక వర్గం కుట్ర పన్నుతున్నది. సీడబ్యూసీలో సభ్యుడినైనందున కుట్ర దారుల పేర్లు వెల్లడించలేను

రాకపోతే ప్రతిఘటన తప్పదు - మేకపాటి
mekapatichandra
ఓదార్పునకు రాకపోతే జనం నుంచి తీవ్ర ప్రతిఘట నలను నేతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్రానికి జగన్‌లాంటి నేత కావాలి.

విషం చిమ్ముతున్న నేతలు - కొండా సురేఖ
sureka
జగన్‌పై కాంగ్రెస్‌ పార్టీలోనే కుట్ర జరుగుతున్నది. ఓదార్పుయాత్రపై మాట్లాడే అర్హత దగ్గుబాటి దంపతులకు ఏమాత్రం లేదు.

ఓదార్పు ఎంత లాభం ?

jagan-sir
తమను కలుసుకునేందుకు వచ్చిన వారితో ఓదార్పు యాత్రకువెళ్ళొద్దని చెప్పటమే తప్ప అధికారికంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏ ప్రకటనా చేయని నేపథ్యం లో కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సోమ, మంగళవారాలలో మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. దశాబ్దాల తరబడి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన కడప జిల్లాలో, అందులోనూ ఆయన ఎంతో ఇష్టపడే పులివెందుల శాసనసభా స్థానం నుంచి ఈ యాత్ర మొదలు కావటం ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది.

ఓదార్పు యాత్రకు ఎవరూ వెళ్ళటానికి వీలు లేదని హై కమాండ్‌ కరాఖండిగా తేల్చి చెప్పినట్టు కేంద్ర మంత్రులు పురంధ్రీశ్వరి, పనబాక లక్ష్మి, మరి కొందరు సీనియర్‌ నేతలు బాహాటంగా ప్రకటనలు చేయటం, యాత్రలో పాల్గొనవద్దని అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ తనకు చెప్పినట్టు ముఖ్యమంత్రి రోశయ్య అందరితో చెబుతున్న నేపథ్యంలో జగన్‌ వాటిని గమనంలోకి తీసుకోకుండా, ఏమాత్రం ఖాతరు చేయకుండా మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. దీని పర్యవసానాల మాట ఎలా ఉన్నా స్వంత జిల్లాలో తన సత్తా ఏమిటో హై కమాం డ్‌కు చూపాలన్న జగన్‌ ఆరాటం స్పష్టంగా బయటపడుతున్నది.

లాభ నష్టాల బేరీజు?
రెండు రోజుల ఓదార్పు యాత్ర విజయవంతం అవుతుందా లేదా అనే సందేహం జగన్‌కు లేదు. అయితే సమీప భవిష్యత్తులో తాను రాజకీయంగా వేయబోయే అడుగులకు సానుకూల వాతావరణం స్వంత జిల్లాలో ఉందా లేదా అనే బేరీజు వేసుకోవ టానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. తన యాత్రకు జనం మద్దతు ఉందని, ఎమ్మెల్యేలు వచ్చినా రాకపోయినా భవిష్యత్తులో పార్టీకి అండగా ఉండేది ప్రజలే కాబట్టి వారి కోరిక మేరకే యాత్ర జరుపుతున్నానని అధిష్ఠానానికి మరోసారి జగన్‌ గుర్తు చేయదలచుకున్నారు. అదే సమయంలో భవిష్యత్తులో తనకు ఈ యాత్ర ఏమేర మేలు చేయగలదో బేరీజు సైతం వేసుకోనున్నారు.

అధికారంలో ఉండగా రాజశేఖరరెడ్డి జిల్లాకు అందులోనూ పులివెందుల నియోజకవర్గానికి చేసిన మేలు అక్కడి ప్రజలు అంత సులభంగా మరచిపోరు. ఇడుపులపాయలో ఆర్‌జెయు గేట్‌ ఏర్పాటు చేయించి విద్యాపరంగా, బ్రహ్మాండమైన రహదారులకు నిధుల కేటాయింపు, సాగు, తాగునీటి రంగానికి ప్రాధాన్యం...ఇలా జిల్లాకు తన శక్తి మేరకు ఏమేమి చేయాలో అన్ని ప్రయోజనాలనూ వైఎస్‌ సమకూర్చారు. ఫలితంగా ఆయన అన్నా, జగన్మోహన్‌రెడ్డి అన్నా జిల్లా ప్రజానీకానికి అభిమానం ఉండటం సహజమే. అయితే ఈ అభిమానం జగన్‌ వేరు కుంపటి పెట్టుకున్నా కొనసాగుతుందా లేక అది కాంగ్రెస్‌ పార్టీ వైపు బదిలీ అవుతుందా అనేదే ఇప్పుడు ప్రశ్న. వచ్చేనెలలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో సుదీర్ఘంగా ఓదార్పు యాత్ర జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న జగన్‌కు స్వంత జిల్లాలో ఎదురయ్యే అనుభవం పైనే తర్వాతి యాత్రల పరిస్థితి అంచనా వేయ వచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వద్దంటున్నది ముగ్గురే...
జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒకరు (ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి-టీడీపీ) మినహా మిగిలిన వారంతా కాంగ్రెస్‌ వారే. అయితే ప్రాథమిక విద్య, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అహ్మదుల్లా సయ్యద్‌ (కడప), డీఎల్‌ రవీంద్రరెడ్డి (మైదుకూరు), జి.వీరశివారెడ్డి (కమలాపురం) తప్ప మిగిలిన ఆరుగురూ వైఎస్‌ వీరాభిమానులే...వైఎస్‌ స్థానంలో ఎన్నికైన జగన్‌ తల్లిగారు విజయమ్మ, కె.శ్రీనివాసులు (కోడూరు), జి.శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), ఆదినారాయణరెడ్డి (జమ్మల మడుగు), అమరనాథరెడ్డి (రాజంపేట), కమలమ్మ (బద్వేలు) ఓదార్పు యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటమిపాలైన వరదరాజులు రెడ్డి లాంటి సీనియర్లు యాత్రకు దూరంగా ఉంటారన్న వార్తలు వస్తున్నాయి. వైఎస్‌ జీవించి ఉన్నంత దాకా ఆయనకు తిరుగు లేదు కాబట్టి జిల్లాలో పలువురు సీనియర్‌ నేతలు ఆయనకు అండగా ఉన్నారు. డీఎల్‌ లాంటి వారు అలాంటి వారే. ఇప్పుడు ఆయన లేకపోవటంతో డీఎల్‌, వీరశివ లాంటి వారు గళాలు పెంచారు. ఈ నేపథ్యంలో జగన్‌ నిర్వహించ తలపెట్టిన స్వంత జిల్లా ఓదార్పు యాత్ర రాజకీయంగా ప్రాధాన్యం సంతరించు కోవటంతో పాటు సమీప భవిష్యత్తులో ఆయన అనుసరించ బోయే వ్యూహాలకు సైతం నాందిగా నిలవనున్నది.

పులి జూదం.. క్లైమాక్స్ దిశగా యాక్షన్ సీన్ సొంత గడ్డ పులివెందులలో సోమ, మంగళవారాల్లో జగన్ పర్యటన

12 కుటుంబాలకు ఓదార్పు
ప్రకాశం యాత్రకు ముందు బల ప్రదర్శన
ఇది 'సెమీఫైనల్' అంటున్న నేతలు
సన్నిహితులతో జగన్ మంతనాలు
ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచే వ్యూహం
నిశితంగా గమనిస్తున్న అధిష్ఠానం
గీత దాటే వారిపై వేటు ఖాయం!
ఈటెల్లాంటి మాటల వేట కొనసాగుతుండగానే, అసలు ఆటకు తెర లేస్తోంది. క్లైమాక్స్ దిశగా యాక్షన్ సీన్ మొదలవుతోంది. అధిష్ఠానం ఆదేశాలను తోసిరాజంటూ, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కడప ఎంపీ జగన్, ఓదార్పు యాత్రతో ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. ఓదార్పును పార్టీపరంగా చేయాలన్న హైకమాండ్ హితబోధను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన వ్యక్తిగతంగానే యాత్రకు వెళ్లబోతున్నారు.

స్వస్థలమైన కడప జిల్లాలో, కంచుకోట వంటి పులివెందులలో సోమ, మంగళవారాల్లో జగన్ పర్యటించబోతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 12 మంది కుటుంబాలను ఆయన ఈ సందర్భంగా ఓదారుస్తారు. ఓదార్పునకు సంబంధించిన కార్యాచరణపై జగన్ ఆదివారం పలువురు నేతలతో చర్చించారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. వైఎస్ వర్ధంతి మరుసటి రోజు నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టి తీరాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్టు తెలిసింది.

తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు ముగిశాక, సంధి-సయోధ్య కోసం జరిగిన పలు యత్నాలు విఫలమైన నేపథ్యంలో... దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న కడప జిల్లాలో పర్యటన తలపెట్టడం ద్వారా జగన్, అధిష్ఠానానికి నేరుగా సవాలు విసురుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చేపట్టే యాత్రకు ముందే, సొంత జిల్లాలో సత్తా చాటడం జగన్ లక్ష్యమని వారు విశ్లేషిస్తున్నారు. కడప జిల్లాలో జగన్ యాత్రను 'సెమీ ఫైనల్'గా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక 'ఫైనల్'కు చేరుకునే దాకా... అం టే ప్రకాశం యాత్ర చేపట్టే సెప్టెంబర్ 3 దాకా అధిష్ఠానం ఆగుతుందా? లేక ఆ లోగానే చర్యలు తీసుకుంటుందా? అన్నది అసలు ప్రశ్న. పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చ సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని స్పష్టం చేసిన సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ, ఏకంగా 'జగన్ పార్టీలో ఉంటే ఎంత? పోతే ఎంత?' అని వ్యాఖ్యానించడంతో, గీత దాటితే జగన్‌పై క్రమశిక్షణ చర్య తప్పదని స్పష్టమైంది. అయితే అది ఎప్పుడు? ఎవరు ముందుగా అడుగు ముందుకు వేస్తారు? అన్నవే ఇప్పుడు కీలక ప్రశ్నలు.

వ్యూహ ప్రతివ్యూహాలు
ఆఖరి అంకానికి సమయం సమీపిస్తుండడంతో, రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా అదే స్థాయిలో తీవ్రమవుతోంది. పురందేశ్వరి, పనబాక లక్ష్మి, కేశవరావు, హర్షకుమార్, సర్వే సత్యనారాయణ, మధుయాష్కీ వంటి వారు ఒకవైపు మోహరించగా, అంబటి రాంబాబు, వైఎస్ వివేకానందరెడ్డి, సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా సురేఖ, పుల్లా పద్మావతి వంటివారు మరోవైపు మోహరించారు.

స్థూలంగా చూస్తే, ఇప్పుడు పార్టీలో హైకమాండ్ వర్గం, జగన్ వర్గం అనే రెండు గ్రూపులు, వాటి మధ్య విభజన రేఖ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యక్తుల కంటే పార్టీ ప్రధానమని అధిష్ఠానం చెబుతున్నప్పటికీ, వైఎస్ తనయుడిగా ప్రజల్లో కరిష్మా ఉ న్న జగన్ వెంట వెళ్లేందుకే తాము మొగ్గు చూపుతామని ఆయన వర్గం చెబుతోంది. పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా శాసనసభ్యులు మాత్రం అధిష్ఠానం మాటను శిరసావహిస్తామని స్పష్టంచేస్తున్నారు.

దీంతో వారిని దారిలోకి తెచ్చుకునేందుకు జగ న్ వర్గం ఒత్తిడిని పెంచుతోంది. ఈ వర్గానికి చెందిన వారు గత 2 రోజులుగా కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఉగ్ర నరసింహారెడ్డిల దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. "వైఎస్ వల్లే అసెంబ్లీకి ఎన్నికైనందున, శాసనసభ్యులు ఓదార్పు యాత్రలో పాల్గొనాలని ఈ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు'' అని వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

ప్రజా ప్ర తినిధుల్లో అత్యధికులు అధిష్ఠానం బాట పట్టడంతో, జగన్ వర్గం, జిల్లాల వారీగా కింది స్థాయి నాయకులతో మాటా మంతీ జరుపుతోంది. పంచాయతీల్లోనూ, మునిసిపాలిటీల్లోనూ, పార్టీ సమావేశాల్లోనూ ఓదార్పు యాత్రకు అనుకూలంగా తీర్మానాలు చేయిం చి ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీన్ని గమనించిన ప్రజా ప్రతినిధులు కూడా ఓదార్పును అధిష్ఠానం ఏ మాత్రం వద్దన లేదని, జిల్లా కేంద్రంలో బాధితులతో కలిపి పార్టీ పరంగా చేయాలని చెబుతోందని, అయితే జగన్ అందుకు అంగీకరించడం లేదని కార్యకర్తలకు వివరిస్తున్నారు.

మరోవైపు 'తిరుమలలో అక్రమాలు- తనపై ఆరోపణల'కు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టిన టీటీడీ పాలకమండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి జగన్ వర్గీయులు సంఘీభావం ప్రకటిస్తున్నారు. సెప్టెంబర్ 2న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యం లో ఇప్పటి నుంచే వేడి రాజేస్తున్నారు. యాత్ర జరిగే ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే కొండా సురేఖ పర్యటిస్తూ, దగ్గుబాటి దంపతులపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ, కాక పుట్టిస్తున్నారు.

రాష్ట్రంలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అధిష్ఠానం, కట్టుదాటిన వారిపై క్రమశిక్షణ వేటు వేసేందుకే సిద్ధమవుతున్నట్టు సీనియర్ నేతలు చెబుతున్నారు. రెండు వర్గాలూ దేనికవి పట్టిన పట్టు వీడకుండా, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుండడంతో, ఈ నెలాఖరులో, సెప్టెంబర్ తొలి వారంలో కాంగ్రెస్ రాజకీయాల్లో పెను మార్పులు తప్పవని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

Friday, August 13, 2010

వద్దే వద్దు! పార్టీ నేతలకు సోనియా ఆదేశం - కేంద్ర మంత్రి ద్వారా సందేశం

 
తాడోపేడో తేల్చేందుకే సిద్ధం
జగన్ వెంట ఎందరున్నారని ఆరా
వ్యతిరేకుల స్వరానికి ప్రోత్సాహం
ముందుకే వెళతానంటున్న జగన్
ప్రకాశంలో యాత్ర పొడిగింపు!
వైఎస్ సభ పోస్టర్ ఆవిష్కరణ
మళ్లీ ఆదేశం.... ఈసారి ఏకంగా అధినాయకురాలి నుంచే!
అదే నిర్దేశం... పార్టీ శ్రేణులన్నింటికీ స్పష్టమైన సందేశం!
'ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ వాదులెవరూ పాల్గొన వద్దు!'
ఇదీ స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జారీ చేసిన తాజా హుకుం!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వర్ధంతి మరుసటి రోజు (సెప్టెంబర్ 3) నుంచి, ప్రకాశం జిల్లాలో ఓదార్పు (మూడో విడత) యాత్రను కొనసాగించాలని కడప ఎంపీ జగన్ నిర్ణయించుకోవడంతో ఇక మేడమ్ సోనియగాంధీయే రంగంలోకి దిగారు. యాత్రకు కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లవద్దని, తన మాటగా దీన్ని పార్టీ శ్రేణులకు చెప్పాలని ఆమె ఓ కేంద్ర మంత్రికి సూచించారు. సదరు కేంద్ర మంత్రి శుక్రవారం పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో సోనియాను కలిశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.

కేంద్ర మంత్రి: ఓదార్పు యాత్రలో పాల్గొనడంపై పార్టీ వాదుల్లో అయోమయం ఉంది. ఈ విషయంలో అధిష్ఠానం నుంచి ఇంతవరకూ స్పష్టత లేదు. సోనియా: అయోమయం లేనే లేదు. ఓదార్పు యాత్రలో మీరు పాల్గొనొద్దు. మీరు పాల్గొనక పోవడమే కాదు; మీ తోటి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు కూడా, యాత్రకు వెళ్లవద్దని స్పష్టంగా చెప్పండి.

కేంద్ర మంత్రి: యాత్ర విషయంలో దళిత ఎమ్మెల్యేలు, ఎంపిీలు, మంత్రులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. సోనియా: ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. ఒత్తిడి ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పండి. వారికి అండగా నేనున్నాను. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇచ్చేది అధిష్ఠానమే అని, వారికి ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇవ్వండి.

కేంద్ర మంత్రి: ఎమ్మెల్యేలకు మా స్థాయిలో మేం చెబుతాం. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ ఈ విషయంలో పార్టీ నేతలకు సరైన మార్గదర్శక సూత్రాలు జారీ చేయలేదు. పైగా ఆ యాత్ర జగన్ వ్యక్తిగతమంటూ ప్రకటనలు చేస్తున్నారు. సోనియా: ఏడీ? వీరప్ప మొయిలీ ఎక్కడ? ఆయనతో నేను తర్వాత మాట్లాడతాను. ఇలా చెప్పిన సోనియా, అన్నట్టుగానే తర్వాత మొయిలీని పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత మొయిలీ విలేఖరులకు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఓదార్పు గురించి మాట్లాడడానికి నిరాకరించారు. జగన్ సెప్టెంబర్ 3 నుంచి జగన్ యాత్ర చేస్తున్నట్లు తనకు సమాచారం లేదన్నారు.

సోనియాతో గురువారం నాటి తన సమావేశం వివరాలు మీడియాలో రావడం పట్ల మొయిలీ అసహనం వ్యక్తం చేశారు. కాగా జగన్ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఆయనకు మద్దతుగా ఉన్నారని సదరు కేంద్ర మంత్రిని సోనియా ఆరా తీశారు. జగన్ యాత్రకు వ్యతిరేకంగా బహిరంగంగా, గట్టిగా మాట్లాడే వారు రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారని కూడా మేడమ్ అడిగినట్టు సమాచారం. అలాంటి వారిని గుర్తించి, తనకు తెలియజేయాలని, వారిని ప్రోత్సహిద్దామని ఆమె అన్నట్టు తెలిసింది.

మొత్తమ్మీద వద్దన్నా యాత్రకు వెళుతున్న జగన్ విషయంలో అధిష్ఠానం క్రమంగా పట్టు బిగిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఈ విషయంలో ఎలాంటి ప్రత్యక్ష వ్యాఖ్యలు చేయని సోనియా, స్వయంగా రంగంలోకి దిగడం హైకమాండ్ సీరియస్‌నెస్‌ను సూచిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. చూస్తుంటే, రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని హైకమాండ్ త్వరలోనే చక్కదిద్దబోతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. గీత దాటితే సహించేది లేదన్న స్పష్టమైన సంకేతాలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అని చెబుతున్నారు.

హైదరాబాద్: అధిష్ఠానం వైఖరి ఎలా ఉన్నా, ఓదార్పు యాత్రలో ముందుకు వెళ్లడానికే జగన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. యాత్రలో పార్టీ వాదులు పాల్గొన వద్దన్న సోనియా నిర్దేశం వెలువడిన కొద్ది గంటల్లోనే జగన్, ఓదార్పు ఆపే ప్రసక్తే లేదని సన్నిహితులకు స్పష్టంచేశారు. అంతేకాదు, ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రకు ముందు అనుకున్నట్టుగా వారం రోజులు సరిపోదని, పొడిగించాలని నిర్ణయించడం గమనార్హం.

ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్‌ను ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి రూపొందించిన వైఎస్ సంస్మరణ సభ పోస్టర్లను జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర విషయం చర్చకు వచ్చింది.

జిల్లా వ్యాప్తంగా వైఎస్ విగ్రహాల స్థాపనకు కార్యకర్తలు పట్టుబడుతున్నందున యాత్రకు వారం రోజులు చాలదని, చాలా రోజులు పట్టేలా ఉందని జగన్ పేర్కొన్నారు. అధిష్ఠానం అవునన్నా కాదన్నా ఓదార్పు ఆగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అటు నెల్లూరు యాత్రకూ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎంపీ మేకపాటి సోదరులు ఈ బాధ్యత తీసుకున్నారు. ఇది ఆనం (రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి) సోదరులకు మింగుడు పడడం లేదన్న ప్రచారం సాగుతోంది.

నెల్లూరు జిల్లా పర్యటన విషయంలో జగన్, ఆనం సోదరులను ఇప్పటి వరకూ సంప్రదించకపోవడం చర్చనీయాంశమైంది. అధిష్ఠానం తాజా నిర్దేశం నేపథ్యంలో జగన్ ప్రకాశం యాత్రలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పాల్గొంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఘటన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన యాత్రలో ప్రజా ప్రతినిధులెవరూ పాల్గొన లేదు. అయితే వారి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో సహా పలువురు ప్రజా ప్రతినిధులు యాత్రలో పాల్గొన్నారు. ఇక ప్రకాశంలో ఏం జరుగుతుందో చూడాలి.

ఓదార్పు జగన్‌ వ్యక్తిగతం... పార్టీ నేతలు పాల్గొనవద్దు... అధిష్టానం వైఖరి...



కడప నియోజకవర్గం ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్రపై మరోసారి కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌ అయ్యింది. ఓదార్పుయాత్ర జగన్‌ వ్యక్తిగతమని, పార్టీ నేతలు ఎవరూ ఆ యాత్రలో పాల్గొనవద్దని అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

అనుచరులతో జగన్ భేటీ...
వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి ఈరోజు ముఖ్య అనుచరులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ రెండున తిరుపతిలో జరిగే వై.ఎస్. రాజశేఖర్‌రె డ్డి వర్ధంతి పోస్టర్లను జగన్ విడుదల చేశారు. కాంగ్రెస్ నేత టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ జనహృదయ నేత వైఎస్‌కు తిరుపతిలో చాలా మంది అభిమానులు ఉన్నారన్నారు.

ఈ సంస్మరణ సభలో 25వేల మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. అలాగే పలు కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. కొండా సురేఖ, అంబటి రాంబాబు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

హైకమాండ్ నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదు : బాలినేని

  కడప నియోజకవర్గం ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని హైకమాండ్ నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ మూడు నుంచి ప్రకాశం జిల్లాలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర యధాతథంగా జరుగుతుందని అన్నారు. ఈ యాత్రంలో తాను పాల్గొంటున్నట్లు తెలిపారు. యాత్ర కోసం తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు మంత్రి బాలినేని పేర్కొన్నారు.

Friday, July 30, 2010

ఎంతకాలం కాదు...ఎలా బతికామన్నది ముఖ్యం : జగన్‌ - ఈ సహనం ఎంతకాలమో... ! ధిక్కారమే !


 తన వ్యతిరేక వర్గంపై యువనేత వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. ఎంతకాలం బతికామన్నది కాదు... ఎలా బతికామన్నది ముఖ్యమని, ఓదార్పుయాత్ర చేస్తానని ప్రకటించిన రోజు ఏ రాజకీయాలు లేవని, ఇపుడు దాన్ని వైఎస్‌ఆర్‌ వ్యతిరేకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తరపున ఓదార్పుయాత్ర ఎందుకు చేయలేదని జగన్‌ ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ చేసిందేమీ లేదని ఆయన వ్యతిరేకులు ఇపుడు ఏదేదో మాట్లాడి అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కాకినాడ నేతాజీ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఓదార్పు యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. కేవలం 10 నిమిషాలే మాట్లాడినా తన నాన్న వైఎస్‌ చేసిన మంచి పనుల గురించి చెబుతూనే తన వ్యతిరేకులపై నిప్పులు చెరిగారు. జగన్‌ రాక సందర్బంగా నేతాజీ పార్క్‌ జనసంద్రమైంది. ఈ సభతో జగన్‌పై అభిమానం ఉప్పెనలా పొంగిందనే చెప్పాలి.  పేలబోయే అగ్నిపర్వతం ముందు కనిపించే ప్రశాంతత.. లావా ఎప్పుడు ఎగజిమ్ముతుందో తెలియని స్థితిలో కనిపించే వేడి.. గుండెల్లో రగులుతున్న బడబాగ్ని.. తనకు, తన అనుచరులకు జరుగుతున్న అన్యాయంపై గుండెమంట..ప్రత్యర్థులపై విరుచు కుపడే పదునయిన పదజాలం.. త్వరలో ఏదో జరగబోతోందన్న సంకేతాలు. ఇవీ.. ఓదార్పు యాత్రికుడు, కడప ఎంపి వైఎస్‌ జగన్‌ గురువారం కాకినాడలో చేసిన ప్రసంగంలో కనిపించిన భావాలు.

18 రోజులపాటు తూర్పు గోదావరిలో ఓదార్పు యాత్ర నిర్వహించి, గురువారం కాకినాడలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదికపై జగన్‌ ఆచితూచి, వ్యూహాత్మకంగా ప్రసంగించారు. మనసులో ప్రత్యర్థులు ఎక్కడికక్కడ తనకు బ్రేకులు వేస్తున్నారన్న ఆగ్రహాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూనే, అక్కడక్కడా తన అసంతృప్తిని ఎక్కడా తొట్రుపాటు లేకుండానే బహిర్గతం చేశారు.

తన తండ్రి వైఎస్‌ మృతి చెందిన వార్తను తట్టుకోలేక మృతి చెందిన వారంతా కాంగ్రెస్‌ కార్యకర్తలు కాదా? వారి కష్ట సుఖాలు తెలుసుకుని ఆర్థిక సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని సూటిగా ప్రశ్నించినప్పటికీ.. ఎక్కడా రోశయ్య ప్రభుత్వాన్నిప్రస్తావించకుండా వ్యూహాత్మకంగానే విమ ర్శలు సంధించారు. కాంగ్రెస్‌ పార్టీని అధికా రంలోకి తెచ్చేందుకు కష్టపడ్డ కార్యకర్తలు తమ ప్రియతమ నేత చనిపోతే వారిని రోశ య్య సర్కారు పట్టించుకోవడం లేదని, తాను పరామర్శించేందుకు వస్తుంటే అడ్డుపడుతున్నారని చెప్పకనే చెప్పినట్లు కనిపించింది. తనను నమ్ముకున్న వారి కోసం పోరాడతారనే పేరున్న రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని జగన్‌ కూడా కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.

తనకు మద్దతు గా నిలిచిన ఎమ్మెల్యే కొండా సురేఖ, అంబటి రాంబాబుకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరికీ న్యాయం చేయలేకపోయానన్న బాధ ఉందని చెప్పడం ద్వారా, తండ్రి మాదిరిగానే. తన కోసం నిలిచిన వారి పక్షాన పోరాడ తానన్న సంకేతాలు పంపించారు. జగన్‌ తన ప్రసంగంలో ఎక్కడా కాంగ్రెస్‌ పార్టీ గురించి కానీ, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గురించి కానీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గానీ ప్రస్తావించకపోవడం బట్టి. తనకు జనం, అనుచరులే ముఖ్యమని పరోక్షంగా స్పష్టం చేశారు.

ప్రసంగం ఆసాంతం తన తండ్రి వైఎస్‌ రాజ శేఖరరెడ్డి పేద ప్రజల కోసం చేపట్టిన కిలో రెండు రూపాయ ల బియ్యం పథకం, విద్యార్థులకు ఫీజుల రీ ఇంబర్స్‌మెంట్‌, మహిళలకు పావలా వడ్డీ వంటి పథకాలు ఏ ముఖ్యమంత్రి ఇచ్చారని నిలదీయడం ద్వారా.. ఒక్క వైఎస్‌ మాత్రమే పేదల కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి అని విస్పష్టంగా ప్రకటిం చారు. సొంత పార్టీలో పెరుగుతున్న విమర్శల దాడులు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు జగన్‌ అంతరంగం ఆగ్రహంతో ఉడికిస్తు న్నాయని ఆయన ప్రసంగం చెప్పకనే చెప్పింది.

అధిష్ఠానం సహా ముఖ్యమంత్రి తనను అణచివేసేందుకు చేస్తున్న ప్రయ త్నాలపై అంతరంగం మండుతున్నా, దానిని సైతం అణచు కుని, లౌక్యంగా, వ్యూహాత్మకంగా మాట్లాడటం అందరినీ ఆక ర్షించింది. మనసులో గూడుకట్టుకున్న ఆగ్రహాన్ని, తనపై జరుగుతున్న అణచివేత వైఖరిని పెదవి చాటున ఓర్పుగా భరిస్తున్నప్పటికీ, ఆ సహనం ఎంతకాలం ఉంటుం దో చెప్ప లేని అయోమయంలో జగన్‌ ఉన్నట్లు ఆయన మాట ల ధోర ణి స్పష్టం చేసింది. ‘ఈ సహనం ఇంకా ఎంతకాలం ఉంటుం దో చెప్పలేను కానీ’ అంటూ తన మనసులో రగులు తున్న భావాలను బయట పెట్టకుండా దానికి వ్యూహాత్మకంగా అస్ప ష్ట ముగింపు ఇచ్చారు. త్వరలో ఏదో జరుగబోతోందన్న ఉత్కంఠతో పాటు.. అధిష్ఠానానికి ‘తాను ఖాళీగా కూర్చోనన్న’ సంకేతాలిచ్చినట్లు స్పష్టమవుతోంది. జనం తన వెంటే ఉన్నారని, 30 మంది ఎమ్మెల్యేలు తనకు దన్నుగా ఉన్నారన్న విషయం జగన్‌ ప్రసంగంలో ప్రతిధ్వనించింది.

ఈ సహనం ఎంతకాలమో... !
jagan-speach ‘ఈ సహనం ఎంతకాలం ఉంటుందో తెలీదు. నా సహనానికి సమయం చెప్పలేను’ అని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి అన్నారు. నాన్నగారు పోతూపోతూ తనను ఒంటరిని చేయలేదని, ఇంత పెద్ద కుటుంబాన్ని, అక్కల్ని, చెల్లెళ్లను, అన్నయ్యల్ని ఇచ్చారని ఆర్ద్రంగా అన్నారు. ‘ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. నాన్నగారు పోయిన తర్వాత ఆ బాధలో కూడా చిరునవ్వుతో ఉన్నానంటే అందుకు మీ ఆప్యాయత, ఆదరాభిమానాలే కారణం’ అని జగన్‌ ప్రజలకు కృత జ్ఞతలు తెలిపారు. గురువారం రాత్రి కాకినాడలో నేతాజీ పార్కులో తన ఓదార్పు యాత్రకు వచ్చిన అశేష ప్రజానీ కాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

jagansirసభకు వచ్చిన ప్రజానీకాన్ని చూసి ఉత్సాహం ఉప్పొంగగా -‘మొత్తం కాకినాడ అంతా ఇక్కడే ఒక్కచోటే ఉందా అనిపిస్తోంది. మీ ఆప్యాయతానురాగాల్ని చూస్తు న్నాను. వైఎస్‌ పట్ల మీ గుండెల్లో ఉన్న అభిమానపు గుండె చప్పుళ్లు వినిపిస్తున్నా యని’ ఉద్వేగంగా అన్నారు. తన తండ్రి మరణించిన తర్వాత ఆయనపై ఉన్న ప్రేమతో, అభిమానం తో కొందరు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబా లను ఓదార్చ డం ఆయన కుమారుడిగా తన కనీస ధర్మమ ని జగన్‌ చెప్పారు. అయితే, తన ఓదార్పు యాత్రకు కూడా ఎందరో ఎన్నో ఆటంకాలు కల్పించారనీ, కానీ ఎవరేమన్నా చేయాల్సింది చేసితీరతానని కడప ఎంపీ స్పష్టం చేశారు.

అంబటి, సరేఖలకు అన్యాయం చేశారు...
‘నన్నే నమ్ముకుని, నా వెంటే ఉన్న కొండా సురేఖకు, అంబటి రాంబాబుకు అన్యాయం జరిగింది. ఎవరు అన్యాయం చేసినా వారు నా గుండెల్లో ఎప్పటికీ ఉంటారు’ అని జగన్‌ వారిపట్ల అభిమానాన్ని ప్రదర్శించారు.ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నానని తెలిపి, ఓదార్పు యాత్రకు ఎలా ప్రేరణ కలిగిందీ ఆయన వివరించారు. గత ఏడాది సెప్టెంబర్‌ 2న నాన్నగారు చనిపోతే, సెప్టెంబర్‌ 25న ఆయన చనిపోయిన పావురాల గుట్టలో సంతాపసభ జరిగింది. నాన్నగారి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారున్నారు.

crowd-ysవారి కుటుంబాలను ఓదార్చడానికి వస్తానని ఆనాడే...నాన్నగారు చనిపోయిన చోటే వాగ్దానం చేశాను. ఈ ప్రాంతంలో ఇంతవరకు నాలుగు జిల్లాలు తిరిగాను’ అని వైఎస్‌ తనయుడు చెప్పారు. రాజశేఖరరెడ్డి ప్రజలకోసం చేపట్టిన పథకాల గురించి చెబుతూ- ‘ఇంతవరకూ ఏ ఒక్క సిఎం అయినా వైఎస్‌లా పేదలకు మంచి వైద్యం అందించాలన్న ఆలోచన చేశారా?పావలా వడ్డీ పథకంతో లక్షలాదిమంది మహిళల్ని లక్షాధికారుల్ని చేయాలని ఎవరైనా ఏ ప్రభుత్వమన్నా సంకల్పించిందా? దేశంలో ఎవరైనా 26 లక్షల మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశం కల్పించా రా? ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించా రా?’ అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ చేసింది వైఎస్‌నే నని ఆయన ప్రస్తుతించారు. జలయజ్ఞాన్ని చేపట్టి లక్షా 80 వేల కోట్లతో ప్రతి ఎకరాకు సాగునీరందించాలని ఎవరైనా సంకల్పించారా? అని అడిగారు. ప్రతి ఎకరాకు లక్షా 80 వేల రూపాయలు ఇచ్చినట్టే కాదా అన్నారు.

మానవత్వంతో, నిండు గుండెతో...
అంతకు మందు మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ జగన్‌ను చూసిన ప్రతివారూ, ప్రతి చోటా నాన్నగారి పేరు నిలబెట్టు బాబూ అని కోరారు. వారి అభిమానం మమ్మల్ని కదిలించింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణిస్తే ఆ బాధను తట్టుకోలేక 750 మంది చనిపోయా రు. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అది చూసి మానవత్వంతో, నిండు హృదయంతో జగన్‌ వారి కుటుం బాల్ని ఓదార్చేందుకు వచ్చారు’ అని పేర్కొన్నారు. వర్షంలో నూ వేలాది మంది ప్రజలు సమావేశానికి హాజరయ్యారు.

సర్కారు సంగతేమిటి?
జగన్ వేరుకుంపటి పెడితే రోశయ్య ప్రభుత్వం పరిస్థితి?

బతుకుతుందా? కూలుతుందా?
మధ్యంతరం వస్తుందా?
రాష్ట్రపతి పాలన తెస్తుందా?
భవిష్యత్తు రాజకీయంపై ఆసక్తికర చర్చ
 'సహనం నశిస్తున్నది' అంటున్న కడప ఎంపీ జగన్ వేరు కుంపటి పెట్టుకుంటే రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? బొటాబొటి మెజారిటీతో నెట్టుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏమిటి? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వారసుడిగా తెరపైకి రాబోతున్న జగన్ వెంట వెళ్లేది ఎందరు? కురు వృద్ధుడైన ముఖ్యమంత్రి రోశయ్యకు, హై కమాండ్‌కు అండగా ఉండేది ఎవరు?


మధ్యంతరం వస్తుందా? రాష్ట్రపతి పాలనతో ఆగుతుందా? అసలు... సర్కారు కుప్పకూలుతుందా? ఆపత్కాల 'సహచరుల' అండతో నిలబడుతుందా? ఇదీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ! ఎన్నో సమీకరణాలు, మరెన్నో సంభావ్యతలు!

రాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 294. స్పీకర్‌ను మినహాయిస్తే, ప్రభుత్వ మనుగడకు (కనీస మెజారిటీ) 147 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 156! అంటే మేజిక్ ఫిగర్ కంటే కేవలం 9 మంది మాత్రమే ఎక్కువ అన్న మాట! ఈ అత్తెసరు పరిస్థితే భవిష్యత్తు రాజకీయాన్ని అత్యంత ఆసక్తికరంగా మారుస్తోంది. ఏం జరుగుతుందన్న ఉత్కంఠను రేపుతోంది.

ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్న జగన్ , వేరుకుంపటి పెట్టుకోవడం అంటూ జరిగితే, తక్షణం రోశయ్య ప్రభుత్వాన్ని పడగొట్టడమే ఏకైక కార్యక్రమంగా పావులు కదుపుతారనడంలో ఎవరికీ సందేహాలు లేవు. ఎందుకంటే రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు దాదాపు నాలుగేళ్ల సమయం ఉంది. అప్పటిదాకా వేచిచూసే ఉద్దేశమే ఉంటే ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగేవారు.

రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటే తప్ప జగన్ వెంటనే సీఎం కావడం సాధ్యం కాదు. అది ఎలాగూ జరిగే పని కాదు కనుక, వెంటనే ప్రభుత్వాన్ని పడగొట్టి, మధ్యంతర ఎన్నికలను తెచ్చి, లక్ష్య సాధనకు ప్రయత్నించడమే జగన్ వ్యూహంగా భావించవచ్చు.

అయితే ప్రభుత్వాన్ని ఆయన పడగొట్టగలరా? మామూలుగానైతే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జగన్ తన వైపునకు తిప్పుకోగలిగితే ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం... ముగ్గురు ఇండిపెండెంట్లు, ఏడుగురు మజ్లిస్ సభ్యులు ఇప్పటికే కాంగ్రెస్‌కు సన్నిహితంగా మెలుగుతున్నారు.

ఇక 18 మంది సభ్యులున్న ప్రజారాజ్యానికి కూడా అధిష్ఠానం 'ముందు జాగ్రత్త'గా స్నేహహస్తం అందించి ఉంచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం నుంచి కనీసం 38 మందిని చీల్చగలిగితేనే రోశయ్య ప్రభుత్వాన్ని జగన్ మైనారిటీలో పడేయగలరు. ఈ క్రమంలోనూ ఇరువైపులా మళ్లీ అనేక ప్రశ్నలు, ప్రతిబంధకాలు. అవేమిటంటే....

ముగ్గురు స్వతంత్రులూ వైఎస్ హయాంలో కాంగ్రెస్ అనుబంధ సభ్యులుగా మారారు. వారిప్పుడూ కాంగ్రెస్ వైపే ఉంటారా? జగన్ వైపు తిరుగుతారా? స్వతంత్రులు ప్రభుత్వంవైపే ఉండడం సాధారణంగా కనిపించే పరిణామం. ఇక 18 మంది పీఆర్పీ ఎమ్మెల్యేల్లో కనీసం ఐదుగురు వైఎస్ కుటుంబానికి సన్నిహితులు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి వారు సర్కారుకు మద్దతిస్తారా?

కాకినాడలో గురువారం జగన్ నిర్వహించిన సభకు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సోనియా ఆమోదం లేకపోయినప్పటికీ, ఎందరు ఎమ్మెల్యేలు జగన్ వద్దకు వెళ్లడం కీలకమేనని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ను కాదని జగన్ ముందుకు నడిస్తే, ఆ పక్కకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే అంచనాలున్నాయి.

కాకినాడ సభకు వెళ్లిన వారిలో చాలామంది, 'ప్రజాదరణ కలిగిన' జగన్‌కు నైతిక మద్దతు మాత్రమే ఇస్తున్నారని, కాంగ్రెస్‌లోనే కొనసాగాల్సిందిగా ఆయనను కోరుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎక్కువమంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారే కావడం, పదవీ కాలం మరో మూడున్నరేళ్లు ఉండడం నేపథ్యంలో, జగన్ కోసం పార్టీతో తెగదెంపులు చేసుకోవడానికి, 'అధికారాన్ని' కోల్పోవడానికి, మళ్లీ ఎన్నికల బరిలో నిలబడడానికి వీరందరు సిద్ధపడతారా? పార్టీయే ముఖ్యమని వెనుదిరుగుతారా?

కాంగ్రెస్‌వాదిగా ఉంటేనే తమ మద్దతు లభిస్తుందని జగన్‌కు చెప్పాల్సిందిగా ఇటీవల కొందరు మంత్రులు యువ ఎమ్మెల్యేలకు కౌన్సెలింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కొందరు ఎమ్మెల్యేలు కాకినాడకు వెళ్లారని ప్రచారం కూడా జరుగుతోంది. అక్కడికి వెళ్లిన వారందరూ వేదికపై కనిపించకపోవడంపై కూడా పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఎక్కువ మంది మాట్లాడేందుకు అవకాశం లేదని, అలాంటివారు కింద కూర్చోవాలని, లేదా వెళ్లేవారు వెళ్లిపోవచ్చని కూడా అక్కడ చెప్పారని దీంతో కొందరు మీటింగ్‌కు ముందే వచ్చేశారనే చర్చ కూడా ఉంది. మరోవైపు బహిరంగ సభకు హాజరు కానప్పటికీ జగన్‌కు మద్దతుగా నిలిచే వారు కాంగ్రెస్ శాసనసభా పక్షంలో ఇంకొందరు ఉన్నారు. వీరందరి సంఖ్యా కనీసం 38ని దాటుతుందా?

ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే, నలుగురు సభ్యుల సీపీఐ, ఒక్కొక్క సభ్యుడున్న సీపీఎం, బీజేపీ, లోక్‌సత్తా ఎలాంటి వైఖరి తీసుకుంటాయి? కొత్తగా ఎన్నిక కాబోతున్న టీఆర్ఎస్ సభ్యులు ఏం చేస్తారు? జగన్ వేరు కుంపటి పెట్టుకుంటే టీఆర్ఎస్ కాంగ్రెస్‌తో కలుస్తుందన్న ప్రచారం సాగుతోందని టీఎన్జీవో నేత స్వామిగౌడ్ గురువారం కేసీఆర్ సమక్షంలోనే చెప్పారు.

'సోనియాకు నామీద అభిమానం ఉంది. ఆమె నాతో ఫోన్ చేసి మాట్లాడుతుంది అనేవి నిజమే కానీ అంటూనే టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో కలిసే అవకాశం లేదని పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం. ఇక 91 మంది సభ్యులున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఏం చేస్తుందన్నది మరో కీలక ప్రశ్న.

తప్పనిసరై సభలో అవిశ్వాసం వస్తే టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు కూడా రోశయ్య సర్కారు పడిపోకుండా సహకరిస్తారని, సభకు గైర్హాజరు అవుతారనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ మనుగడకు పరోక్షంగానైనా సహకరించాలని ఆయా పార్టీలుగానీ, వాటికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు గానీ నిర్ణయించుకుంటే, ఆ పరిస్థితిలోనూ సర్కాను పడగొట్టేంత బలాన్ని జగన్ సంపాదించుకోగలరా?

ఈ కీలక ప్రశ్నలకు సమాధానాలు రావడం అంత సులభం కాదు. జగన్ నుంచి ప్రమాదం అంచనా వేసినందునే అధిష్ఠానం చిరంజీవితో చర్చలు జరిపి ముందస్తు మద్దతు స్వీకరించిందని, మజ్లిస్ కూడా కాంగ్రెస్‌కు తోడ్పాటునందిస్తుందని.. అందువల్ల రోశయ్య ప్రభుత్వానికి ప్రమాదమేమీ ఉండదని ఢిల్లీ నేతలు ధీమాగా ఉన్నట్టు వారు చెబుతున్నారు.

"ఏడాదిన్నర కూడా కాకుండానే ఇప్పటికిప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి ఎమ్మెల్యేలు ఎవరూ సిద్ధంగా లేరు. ఒకవేళ ఉన్నారనుకున్నా, రోశయ్య సర్కారును పడగొట్టిన వెంటనే ఎన్నికలు వస్తాయన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలన విధించవచ్చు.

ఒకసారి రాష్ట్రం ప్రస్తుత గవర్నర్ పాలనలోకి వెళితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రాభవం పోగొట్టుకోక తప్పదు. చేజేతులా అధికారాన్ని కోల్పోయి, ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లా గోళ్లు గిల్లుకోవాల్సి ఉంటుంది'' అని పార్టీ నేత ఒకరు విశ్లేషించారు.

కాంగ్రెస్‌ను కాదంటే జగన్‌కు బలం పెద్దగా ఉండదని లెక్కలు వేస్తూనే అధిష్ఠానం ఇతర ఆలోచనలు కూడా చేస్తున్నది. వెంటనే ఎన్నికలకు సంసిద్ధంగా లేని ఇతర పక్షాలతో, సభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదింప జేసినట్లయితే, తర్వాత ఆరు నెలల దాకా బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరమే ఉండదని అది భావిస్తోంది.

జగన్ సొంత పార్టీ పెట్టుకుంటే, ఆయనతో జత కూడిన ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించి, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించడం మరో మార్గమని, మళ్లీ విశ్వాసం నిరూపించుకోవాల్సిన గడువులోగా వారు పదవులు కోల్పోతారని పార్టీ ముఖ్యులు లెక్క వేస్తున్నారు.

ఏదిఏమైనా ఈ రాజకీయాలు కాంగ్రెస్‌ను గందరగోళంలో పడేయడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 2న సీఎం రోశయ్య ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్ర రాజకీయాలపై అధిష్ఠానంతో ఆయన చర్చించే అవకాశం ఉంది. jagan-speach

Wednesday, July 28, 2010

కాకినాడలో తెగదెంపుల సంగ్రామమా? జ'గన్' పేలేనా? అటు విప్... ఇటు నిప్పు నేడు 'బల ప్రదర్శన'

తూర్పుగోదావరిలో ఓదార్పు ముగింపు
సభకు రావాలంటూ ఎమ్మెల్యేలకు పిలుపు
35 మంది శాసనసభ్యులు వస్తారని అంచనా
మరింత బయటపడ్డ వర్గ విభేదాలు
తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం
 
అధిష్ఠానంతో ఇక అతకనంత దూరం
బెడిసి కొట్టిన సయోధ్య యత్నాలు
సోనియా మాట ఎత్తేందుకు యువనేత ససేమిరా
తదుపరి ఓదార్పు ప్రకాశం జిల్లాలో!

కాంగ్రెస్‌లో 'కదన స్వరాలు' పురి విప్పుతున్నాయి. వర్గాల మధ్య విభజన రేఖలు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయి. బుధవారం రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. 'కాంగ్రెస్‌కు జగన్ తప్ప మరో దిక్కులేదు' అని జగన్ వర్గీయులు పేర్కొనగా... 'మరేం ఫర్వాలేదు! ఆయన పార్టీని వదిలి వెళ్లిపోవచ్చు' అనేలా ప్రత్యర్థులు ఒకింత దీటుగానే బదులిచ్చారు.

సస్పెన్షన్ వేటు పడిన అంబటి రాంబాబు మరోమారు గళమెత్తగా... నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మొట్టమొదటిసారి బహిరంగంగా జగన్‌కు జై కొట్టారు. వీరిద్దరి వ్యాఖ్యలపై ఎంపీలు సర్వే సత్యనారాయణ, వి.హనుమంతరావు, ఎమ్మెల్యే శంకర్‌రావు మండిపడ్డారు. మొత్తానికి... వారూ వీరూ కలిసి కథను మరింత త్వరగా 'క్లైమాక్స్' చేర్చే సంకేతాలు పంపుతున్నారు.

జగన్ వ్యవహారాన్ని దగ్గరుండి పరిశీలించాలని అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే వచ్చేనెల 6న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. అలాగే.. 4వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలోనూ జగన్‌కు సంబంధించిన చర్చ జరిగే అవకాశముంది.

ఇన్ని పరిణామాల మధ్య... తూర్పు గోదావరి జిల్లాలో షెడ్యూలుకు అతీతంగా సాగిన జగన్ ఓదార్పు యాత్ర ముగింపు సభ గురువారం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు వివిధ జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలు కాకినాడకు చేరుకున్నారు. సభను జగన్ వర్గీయులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీనిని 'బహిరంగ బల ప్రదర్శన'కు వేదికగా మారుస్తున్నారు. సభలో పాల్గొనాల్సిందిగా నేతలకు సమాచారం పంపారు.

తన వర్గీయుడైన అంబటి రాంబాబుపై సస్పెన్షన్ వేటు వేసినా తమాయించుకున్న జగన్... గురువారం నాటి సభలో అధిష్ఠానంపైనా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపైన మాటల తూటాలు పేల్చే అవకాశముందని ఆయన వర్గీయులే అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్ర ముగింపు సందర్భంగా రణస్థలంలో ముఖ్యమంత్రి రోశయ్యను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలాన్ని రేపాయి.

ఇప్పుడు కూడా తన యాత్రలో పాల్గొనకుండా ఎమ్మెల్యేలను రోశయ్య అడ్డుకుంటున్నారని జగన్ భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర నాయకత్వంతో పాటు, అధిష్ఠానంపైనా నిప్పులు చెరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే... అధిష్ఠానానికి తమ బలం చూపడమే లక్ష్యమని, జగన్ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు ఏవీ చేయబోరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గురువారం జగన్ అలాంటి వ్యాఖ్యలు చేసినా, చేయకపోయినా... ఆయనకూ, అధిష్ఠానానికీ మధ్య పరిస్థితి ఇప్పటికే 'ఉప్పూ, నిప్పు'లా మారింది.

విపక్షాల వాయిదా తీర్మానం నేపథ్యంలో బుధవారం పార్టీ ఎంపీలంతా లోక్‌సభకు హాజరు కావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది. పార్లమెంటు సమావేశాల గురించి పట్టించుకోని జగన్... విప్‌ను కూడా పక్కకు పడేశారు. ఓదార్పు యాత్రలోనే ఉన్నారు. గురువారం బహిరంగ సభలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. వీటన్నింటి నేపథ్యంలో కడప ఎంపీకి, కాంగ్రెస్ అధిష్ఠానానికీ మధ్య అగాథం పూడ్చలేనంతగా పెరుగుతోంది.

జగన్ కాంగ్రెస్‌లోనే ఉండాలని భావిస్తున్న ఆయన వర్గీయులకు ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. 'రాజీకి మార్గాలు మూసుకుపోయి కనిపిస్తున్నాయి. ఇలాంటి ధిక్కారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సహించే ప్రసక్తి ఉండదేమో!' అని జగన్ శ్రేయోభిలాషుల్లో ఒకరైన ఎంపీ సబ్బం హరి సైతం అభిప్రాయపడటం గమనార్హం. అధిష్ఠానం మాట ఎలా ఉన్నా... సయోధ్యకు యువనేతే ససేమిరా అంటున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పేరెత్తడానికే ఆయన ఇష్టపడటంలేదని తెలుస్తోంది. తాము అధిష్ఠానం మాటను ధిక్కరించలేమని, ఇదే సమయంలో జగన్‌ను వదులుకునేందుకు కూడా సిద్ధంగాలేమని ఆయన వర్గీయుల్లోనే కొందరు అంటున్నారు. వీరు సయోధ్య యత్నాలకు శ్రీకారం చుట్టారు. కొందరు నేతలు ఇటీవల వైఎస్ బంధువు వైవీ సుబ్బారెడ్డిని కలివారు.

జగన్‌కు, అధిష్ఠానానికి మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు చొరవ చూపాలని సూచించారు. వారి సూచనలతో వైవీ సుబ్బారెడ్డి కూడా ఏకీభవించారు. అయితే... 'నేను జగన్‌కు ఎలాంటి సలహాలూ ఇవ్వను. మీలో ఎవరో ఒకరు ఆయనను కలసి చెప్పాలనుకున్నది చెప్పండి' అని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్‌తో సమావేశమయ్యారు. అధిష్ఠానంతో వైరం పెంచుకుంటూ పోవడంకంటే.. సయోధ్యతో ముందుకు సాగడమే మంచిదని తెలిపారు. ఓదార్పు యాత్రలో సోనియాను ప్రశంసిస్తూ ప్రసంగించాలని సూచించారు. దీనికి జగన్ ససేమిరా అన్నారు.
'నా ఓదార్పు యాత్రకు సోనియా అనుమతి ఇవ్వలేదు. ఇది జగమంతటికీ తెలుసు. ఓదార్చేందుకు వస్తానని పావురాలగుట్ట సభలోనే ప్రకటించాను. ఆ మాటను నిలబెట్టుకుంటున్నాను. నాన్న రక్తం నాలో ప్రవహిస్తోంది. బాధిత కుటుంబాలను ఓదార్చాల్సిన బాధ్యత నాపై ఉంది.

ఇదే విషయాన్ని అధిష్ఠానానికి వివరించాను. యాత్ర పట్ల సోనియా సుముఖతను వ్యక్తం చేయలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ యాత్రలో సోనియాను ప్రశంసించాలని నాతో ఎలా చెబుతారు? ఇది సాధ్యం కాదు. ఆ ఆస్కారమే లేదు'' అని జగన్ తేల్చి చెప్పినట్లు తెలిసింది.

బుధవారం ఎంపీలు సబ్బం హరి, అనంత వెంకట్రామిరెడ్డి, కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ ఢిల్లీలో భేటీ అయ్యారు. జగన్ విషయంపై చర్చించారు. వీరు జగన్‌కు, అధిష్ఠానానికీ మధ్య తెగతెంపులు కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిసింది. ఎంపీలు కిళ్లి కృపారాణి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా జగన్ పార్టీలో లేకపోతే పార్టీకే నష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సభలో బల ప్రదర్శన...
తూర్పు గోదావరి జిల్లాలో షెడ్యూలుకు అతీతంగా సాగిన 'ఓదార్పు' యాత్ర గురువారం బహిరంగ సభ రూపంలో ముగియనుంది. ఈ సభకు జగన్ అనుచరగణం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఈ సభ వేదికపై జగన్ తన మనసులోని మాటను వెల్లడించాలని నిర్ణయించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

సభకు సరిగ్గా ఒక్కరోజు ముందు... అంబటి రాంబాబు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలుగా భావించలేమని.. జగన్ మనసులోని మాటలుగానే పరిగణించాల్సి వస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

ఇప్పటిదాకా ఏదైనా జిల్లాలో ఓదార్పు యాత్ర ముగింపు సమయంలో జగన్ తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడమే జరిగింది. తొలిసారిగా కాకినాడలో బహిరంగ సభకు వేదికను సిద్ధం చేయడం చర్చనీయాంశమైంది. ఈ సభకు సాధ్యమైనంత మంది ఎక్కువ ఎంపీలను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుచర గణంతో సహా తరలి రావాలంటూ నేతలకు పిలుపులు వెళ్లాయి.

ఇప్పటికే జగన్ వర్గీయులుగా పేరొందిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు (రైల్వే కోడూరు), అమర్‌నాథ్‌రెడ్డి (రాజంపేట), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), రామచంద్రారెడ్డి (రాయదుర్గం), శివప్రసాదరెడ్డి (దర్శి), పి. రామకృష్ణారెడ్డి (మాచర్ల) కాకినాడలో బస చేశారు. బుధవారం వీరంతా జగన్‌ను కలిశారు.

మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు కూడా కాకినాడ చేరుకున్నారు. ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి దంపతులు, ఆళ్లనాని, జోగి రమేశ్ తదితరులు కూడా సభకు వచ్చే వీలుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక.. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తోపాటు ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు జగన్ యాత్రలో భాగస్వాములయ్యారు. వీరంతా గురువారం నాటి సభలో పాల్గొనే అవకాశముంది. ఏ విధంగా చూసినా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఈ సభలో పాల్పంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

జగన్ వర్గీయులు మాత్రం 35 మంది ఎమ్మెల్యేలు రావడం ఖాయమని చెబుతున్నారు. తదుపరి 'ఓదార్పు' ప్రకాశం జిల్లాలో ఉంటుందని జగన్ ఈ సభలోనే ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు. త్వరలో తెలంగాణలోనూ జగన్ యాత్ర నిర్వహిస్తారని గట్టు రామచంద్రరావు కాకినాడలో తెలిపారు. జగన్ గురువారం రాత్రి రైలులో హైదరాబాద్‌కు బయలుదేరతారు.