Tuesday, January 4, 2011

నేనున్నానని...

విశాఖ జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురంలో వైఎస్ దుర్మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన రాజమహేంద్రవరపు సన్యాసి కుటుంబాన్ని యువనేత జగన్ మంగళవారం ఓదార్చారు. సన్యాసి ఇంటికి వెళ్లి ఆమె భార్య మహాలక్ష్మమ్మ, కుమారుడు అప్పారావు, కోడలు లక్ష్మి, కుమార్తె వరలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్‌కు వీరాభిమానిగా ఉన్న సన్యాసి ఆయన మరణవార్త విన్నప్పట్నుంచీ దిగాలుగా ఉండేవాడని, 2009 సెప్టెంబరు 5న మహానేత చిత్రపటం ఊరేగింపును చూస్తూ అక్కడికక్కడే కుప్పకూలాడని కుటుంబ సభ్యులు జగన్‌కు తెలిపారు. కాసేపటికే ఆయన మరణించాడని వివరించారు. తమకు సొంతిల్లు కూడా లేదని, సన్యాసి మరణంతో తమ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని విలపించారు. సన్యాసికి ప్రతి నెలా వచ్చే పింఛనును తమ కుటుంబంలో ఒకరికి ఇప్పించాలని ప్రాథేయపడ్డారు. దీనిపై స్పందించిన జగన్ మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. యువనేత తమను ఓదార్చడానికి వచ్చినందుకు సన్యాసి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పండ్లు తినిపించారు.
అండగా నేనుంటా...
రావికమతం (విశాఖ జిల్లా): వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక గౌరీపట్నంలో మృతిచెందిన కలవలపల్లి వెంకునాయుడు కుటుంబాన్ని యువనేత జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఓదార్చారు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వెంకునాయుడు ఇంటికి చేరుకున్న జగన్.. ఆయన భార్య నారాయణమ్మ, కుమార్తెలు జగ్గయ్యమ్మ, రమాదేవి, చంద్రలక్ష్మిలను పరామర్శించారు. జగన్‌ను చూసి వారు కన్నీరుమున్నీరయ్యారు. వెంకునాయుడు వైఎస్‌పై ఎంతో మమకారం చూపించేవారని చెప్పారు. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారన్న వార్తలు టీవీలో చూస్తూనే చనిపోయాడని వివరించారు. వారి కన్నీళ్లు తుడిచిన జగన్.. కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. 
కన్నమ్మ ప్రేమ..
ఆమె వయస్సు 90 ఏళ్లు. పేరు కన్నమ్మ. విశాఖ జిల్లా చోడవరంలోని యడ్లవీధిలో ఉంటోంది. ఎవరైనా చేయందిస్తేనేగాని కూర్చొని లేచే ఓపిక లేదు. అలాంటి స్థితిలో ఊతకర్ర చేత పట్టుకుని పడుతూ లేస్తూ జనసంద్రంలోకి ప్రవేశించింది. ‘ఆ మారాజు (వైఎస్) కొడుకు జగన్‌బాబొచ్చేడంట కదా? ఎక్కడున్నాడు బాబూ..? అంటూ జనాన్ని తప్పించుకుంటూ సభా వేదిక సమీపంలోకి వచ్చింది. అదీ ఒట్టి చేతుల్తో కాదు.. తనకు వైఎస్ పుణ్యాన వచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు చేతబట్టుకుని!

‘ఆ బాబు (వైఎస్) పున్నాన్ని (పుణ్యాన) నెలకి రెండొందలు పించిణీ (పెన్షన్) తీస్కుంటున్నాను. ఆరోగ్గం బాలేకపోతే ఈ కార్డుతో బాగు సేయించుకున్నాను. నా పెనిమిటి (భర్త) లేడు, పిల్లలూ లేరు. ఒక్కదాన్నే ఉంటున్నాను. కళ్లు కూడా బాగా ఆనడం లేదు. ఆ బాబును (జగన్)ను సూసిపోదామనొచ్చేను. సూపించరు బాబూ...’ అని అడగ్గా.. అక్కడున్న వారు అదుగో... అతనే జగన్‌బాబు... చూడు అంటూ చూపించారు. యువనేతను చూసిన సంబరంతో.. ‘నా నాయనే సల్లంగా ఉండు’ అని దీవించింది.

No comments:

Post a Comment