Monday, January 3, 2011

విశాఖే కదిలి వచ్చింది * జగన్ కోసం తరలివచ్చిన జనప్రవాహం - కిక్కిరిసిపోయిన రోడ్లు.

* 11న ఢిల్లీ దీక్ష నేపథ్యంలో 10 నుంచి విశాఖ ఓదార్పుకు విరామం
* సంక్రాంతి తర్వాత పునఃప్రారంభం



విశాఖ జనమంతా వీధుల్లోకి వస్తే.. ఆ వీధులన్నీ మెయిన్‌రోడ్డువైపే పరుగులు తీస్తే... ఆ రోడ్లు ఇసుకవేస్తే రాలనంతలా కిక్కిరిసిపోతే... అదంతా ఒకే ఒక్కనాయకుడి కోసమైతే.. సోమవారం ఇదే దృశ్యం విశాఖలో ఆవిష్కృతమైంది. ఓదార్పుయాత్ర కోసం వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనంగాస్వాగతం పలికేందుకు, నీ వెంట మేమున్నామని చాటేందుకు జనం రోడ్లపైకి వచ్చారు. విమానాశ్రయం మొదలు యువనేత సాగిన ప్రతిదారీ జనసంద్రాన్ని తలపించేలా వచ్చిన అభిమానులు జగన్‌ను తమ ఆత్మీయ బంధువుగా అక్కున చేర్చుకున్నారు. జై జగన్ నినాదాలతో యువకులు ర్యాలీలుగా వెంట రాగా.. మహిళలు భారీ సంఖ్యలో బారులు తీరి స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జగన్‌కు స్వాగతం పలికారు.

కట్టలు తెంచుకున్న అభిమానం..
జిల్లాలో 18 కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30కు విమానాశ్రయంలో దిగిన ఆయన.. వేలాది మంది తరలివచ్చినా.. అక్కడి నుంచి వడివడిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అయినా జనం పోటెత్తడంతో దగ్గరలో ఉన్న ఎన్‌ఏడీ జంక్షన్ చేరేసరికి 45 నిమిషాలు పట్టింది. అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి.. భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కంపర బాబూరావు కుటుంబాన్ని ఓదార్చేందుకు 2.40కి పద్మనాభనగర్ చేరుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి 4.30కు నాయుడుతోటలో, 4.55కు వేపగుంటలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు.

ప్రతి ఒక్కరూ రోజూ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు.. చివరికి అన్నం తింటున్నప్పుడు కూడా నాన్నను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారని.. ప్రతి ఒక్కరితో వైఎస్‌కున్న అనుబంధాన్ని గుర్తుకుతెచ్చారు. రైతులు, చేనేత కార్మికులు, పేదవాళ్లు, వైఎస్‌ను ఎలా గుర్తుకు తెచ్చుకుంటున్నారో చెబుతూ జగన్ ముందుకు కదిలారు. సాయంత్రం 6.00 గంటలకు సింహాచలం చేరుకున్నారు. దారి పొడవునా ప్రతి పల్లెలో జనం జగన్‌కు స్వాగతం పలికారు. 6.40 సింహాద్రి అప్పన్నను దర్శించుకుని 8.10కి శొంఠ్యాం దగ్గర గండిగుండెం జంక్షన్ చేరుకున్నారు. అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. 8.30కు నీళ్లగుండీలు గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ కాలనీవాసులు తమ కాలనీకి వైఎస్‌ఆర్ కాలనీ అని పేరుపెట్టుకుని తమ అభిమానం చాటుకున్నారు. అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు గుర్రంపాలెం చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వచ్చేదని..
9.25కు పెందుర్తి మండల కేంద్రానికి చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని రాష్ట్రానికే కాదు.. దేశానికి చాటిచెప్పిన వ్యక్తి వైఎస్’ అని గుర్తు చేసుకున్నారు. మాట ఇస్తే నష్టమైనా కష్టమైనా నిలబడాలని చెప్పేవారని, ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యమని చెబుతుండేవారని జగన్ ప్రసంగిస్తున్నప్పుడు జనం జగన్‌కు జేజేలు పలికారు. వైఎస్ జోహార్ అంటూ నినదించారు. విలువలు, విశ్వసనీయతకు అర్థం తెచ్చిన వ్యక్తి వైఎస్ అని చెబుతున్నప్పుడు జనం చప్పట్లతో హోరెత్తించారు.

ఆ మహానుభావుడు బతికే ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వచ్చేదని ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నప్పుడు.. అవునూ.. అవునూ.. అంటూ నినదించారు. రాత్రి 10 గంటలకు సుజాతనగర్‌లో విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. 10.20కి రామాపురంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి గండి భూలోకయ్య కుటుంబాన్ని ఓదార్చారు. 11 గంటలకు పినగాడి జంక్షన్, 11.30కు సబ్బవరంలో విగ్రాహావిష్కరణలకు జనం కిక్కిరిసిపోయారు. తర్వాత లింగాలతిరుగుడులో దొడ్డి కోటేశ్వరరావు కుటుంబాన్ని ఓదార్చిన యువనేత 12.45 గంటలకు అడ్డూరులో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అర్ధరాత్రి దాటాక కూడా యాత్ర కొనసాగుతోంది.

ఓదార్పుకు విరామం
11న ఢిల్లీలో దీక్ష చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో 10వ తేదీ నుంచి విశాఖ ఓదార్పుకు జగన్ విరామం ఇవ్వనున్నారు. సంక్రాంతి తర్వాత యాత్ర పునఃప్రారంభమవుతుంది.

ఏ అవసరమొచ్చినా ఫోన్ చేయండి
‘మీకు అండగా ఎవరూలేరని అనుకోకండి.. మీకే కష్టమొచ్చినా నేనున్నాను.. అవసరమైతే ఫోన్ చేయండి’ అంటూ కంపర బాబూరావు కుటుంబానికి యువనేత జగన్ భరోసా ఇచ్చారు. విశాఖలోని గోపాలపట్నం శివారు పద్మనాభనగర్‌లో వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన బాబూరావు ఇంటికి సోమవారం మధ్యాహ్నం యువనేత వెళ్లారు. మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కంటతడి పెట్టుకున్న బాబూరావు తల్లి అప్పలనర్సమ్మను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబ పరిస్థితి, సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ‘మీ నాన్న చనిపోయిన బాధలోఉన్నా మా కోసం వచ్చావా బాబూ...’ అంటూ అప్పలనర్సమ్మ జగన్‌ను అక్కున చేర్చుకున్నారు. బాబూరావు సోదరుడు నాగరాజు, సోదరి కన్నమ్మల బాగోగులను యువనేత అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబం ఆప్యాయంగా పెట్టిన స్వీట్లు, పండ్లు తిన్నారు.
భూలోకయ్య కుటుంబానికి భరోసా...
విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని రాంపురం గ్రామంలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలొదిలిన గండి భూలోకయ్య కుటుంబాన్ని యువనేత జగన్ సోమవారం రాత్రి పదిన్నర గంటలకు పరామర్శించారు. భూలోకయ్య భార్య నాయుడమ్మ, కుమారులు భీముడు బాబు, గణపతిరావు, భూషణరావులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. పదోతరగతి చదువుతున్న కుమార్తె రూప ఉన్నత చదువులకోసం సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. నాయుడమ్మ చేతుల మీదుగా పాయసం, యాపిల్ పండు ముక్కలు, పిల్లల చేతుల మీదుగా స్వీట్లు తిన్నారు. వారికి ఏసమస్య వచ్చినా తాను అండగా ఉంటానన్నారు. తన ఫోన్ నంబర్ ఇచ్చి సమస్యల్లో ఆసరాగా ఉంటానని భరోసా ఇచ్చారు. అక్కడకు వచ్చిన మహిళలు జగన్‌కు అభిమానంతో రాఖీలు కట్టారు. ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. పదినిమిషాలపాటు ఆ ఇంట గడిపిన జగన్ 10.50గంటలకు బయటకు వచ్చి యాత్ర కొనసాగించారు.

No comments:

Post a Comment