Saturday, January 22, 2011

వీరికి జేజేలు లేవు... * జనం మదిని గెలవని ప్రభుత్వ పెద్దలపై జగన్ ధ్వజం

‘నాన్న బతికున్నప్పుడు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. బతికి ఉన్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం కాదు.. చనిపోయాక ఎందరి గుండెల్లో బతికి ఉన్నామన్నదే గొప్ప సంగతీ అనేవారు. కానీ ప్రస్తుత పాలకులు కనీసం బతికి ఉన్నప్పుడు కూడా జేజేలు కొట్టించుకోలేకపోతున్నారు. తమ గోడు వినేవారు లేక సామాన్యులు ఆకాశం వైపు చూసి దేవుడా.. వైఎస్‌ను మళ్లీ పంపు అని వేడుకుంటున్నారు’ అని యువనేత వైఎస్ జగన్ ప్రభుత్వ పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో చివరి రోజు శుక్రవారం ఓదార్పు యాత్రలో భాగంగా పాతగాజువాకలో ఆయన మాట్లాడారు.

‘వరదల మీద వరదలు, దెబ్బ మీద దెబ్బ పడుతోందని లక్ష మంది రైతులు కలిసి విజయవాడలో దీక్ష చేస్తే వారికి న్యాయం చేయరు.. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పు అన్యాయంగా ఉందని, రాష్ట్రం పూర్తిగా ఎడారిగా మారుతుందని ఢిల్లీలో రోజంతా దీక్ష చేస్తే ప్రజల గోడు వినేందుకు ప్రధానమంత్రికనీసం ఐదు నిమిషాలు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వరు. వైఎస్ బతికున్నప్పుడు పోలవరం పనులు చకచకా నడిస్తే.. ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న పరిస్థితి ఉంది. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల, దుమ్ముగూడెం టెయిల్‌పాండ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు ఎందుకు ఇవ్వరు? అని అడుగుతున్నా.. రాష్ట్రం అథోగతి పాలవుతుంటే పట్టించుకునే నాథుడేడీ అని అడుగుతున్నా..’ అంటూ జగన్ ఆందోళన వ్యక్తంచేశారు.


గాజువాకలో జనహోరు..
విశాఖ జిల్లాలో పదో రోజైన ఓదార్పు యాత్ర శుక్రవారం విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల మీదుగా సాగింది. నగరంలోని రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. గురువారం రాత్రి గాజువాకలో బస చేసిన జగన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు పెదగంట్యాడలో విగ్రహావిష్కరణతో యాత్ర ప్రారంభించారు. ఇక్కడ మొదలైన జనహోరు అర్ధరాత్రి వరకు కొనసాగింది. మధ్యాహ్నం ఒంటిగంటలోగా పెదగంట్యాడ, సీతానగరం, దేశపాత్రునిపాలెం, గౌతు లచ్చన్ననగర్, అగనంపూడి సెంటర్లలో విగ్రహాలు ఆవిష్కరించారు. తరువాత కూర్మన్నపాలెం, శ్రీనగర్, డ్రైవర్స్‌కాలనీలలో విగ్రహాలు ఆవిష్కరించారు. అక్కడి నుంచి పాతగాజువాక సెంటర్‌కు చేరుకున్నారు. ఇక్కడి విగ్రహావిష్కరణకు భారీగా జనం తరలివచ్చారు. ఈ హైవే జంక్షన్‌లో జనం కిక్కిరిసిపోయారు.

ఇక్కడి నుంచి కొత్తగాజువాక, బీసీరోడ్డు తదితర ప్రాంతాల రహదారుల్లో జనం పోటెత్తారు. కొత్తగాజువాక, బీసీరోడ్డులలో విగ్రహాలు ఆవిష్కరించాక.. సాయంత్రం 6.30కు ఆనందపురం చేరుకున్నారు. ఆనందపురం అంతా ఒక్కటై సెంటర్‌కు తరలివచ్చింది. అనంతరం వెల్లంకిలో విగ్రహావిష్కరణ చేసి తగరపువలస వైజంక్షన్ చేరుకున్నారు. ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించి పట్టణ కూడలిలో మరో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కూడలి జనసంద్రంగా మారింది. మూడు గంటలు ఆలస్యమైనా జనం ఓపిగ్గా నిరీక్షించారు. ఇక్కడి నుంచి జగన్ రాత్రి 8.50కి చిల్లపేట చేరుకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత భీమిలిలో రెండు విగ్రహాలు ఆవిష్కరించి, పసుపులేటి వెంకటరమణ కుటుంబాన్ని ఓదార్చారు. మీ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తర్వాత 11 గంటలకు గంభీరంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత బోరవాని పాలెం, కొమ్మది జంక్షన్, చంద్రంపాలెం, 12.30కు పీఎం పాలెంలలో విగ్రహాలను ఆవిష్కరించారు.

నిర్వాసితులకు బాసట

ఉదయం అగనంపూడిలో జగన్ మాట్లాడుతూ ‘విశాఖకు స్టీలు ప్లాంటు రావాలని 1969 నుంచి 71 వరకు జరిగిన ఉద్యమంలో 52 మంది ప్రాణ త్యాగం చేశారు. ఆ త్యాగాలతో వచ్చిన ప్లాంటుకు స్థానికులు 28 వేల ఎకరాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఆర్ కార్డుల సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. కానీ వైఎస్సార్ ఏ ఒక్కరినీ గాలికి వదిలేయలేదు. స్టీలు ప్లాంటు విస్తరణ జరిగేటప్పుడు నిర్వాసితులు అందరికీ ఉద్యోగాల్లో 50 శాతం కేటాయింపును ఇస్తూ ఆర్ కార్డులు పంపిణీ చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కింది..’ అని అన్నారు.

విశాఖలో ముగిసిన ఓదార్పు..

విశాఖపట్నం జిల్లాలో శుక్రవారంతో ఓదార్పుయాత్ర ముగిసింది. తొలివిడతలో జనవరి 3 నుంచి 8 వరకు సాగగా.. మలివిడత 18వ తేదీ నుంచి శుక్రవారం వరకు కొనసాగింది. మహానేత మరణ వార్త విని ప్రాణాలు కోల్పోయిన 18 మంది అభిమానుల కుటుంబాలను జగన్ ఈ ఓదార్పు యాత్రలో పరామర్శించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 200 విగ్రహాలు ఆవిష్కరించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా జన దీక్ష: అంబటి

రాష్ట్ర ప్రజల కష్టాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా యువనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేపడుతున్నారని ఏపీఐఐసీ మాజీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. సాగర తీరంలో యువనేత నిర్వహిస్తున్న జన దీక్ష ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. జగన్ ఉద్యమంపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత రచ్చబండ కార్యక్రమంపై స్పందిస్తూ కాంగ్రెస్‌లో రచ్చ ఎపుడో మొదలయిందని, ప్రస్తుతం బండే మిగిలుందన్నారు.

No comments:

Post a Comment