Thursday, January 6, 2011

ఉద్విగ్న క్షణాలు..

చెమ్మగిల్లిన నయనాలు.. మౌన వేదనతో కరువైన మాటలు.. ఇవీ అక్కడ నెలకొన్న ఉద్విగ్న క్షణాలు.. మహానేత వైఎస్ అకాల మరణంతో గుండె ఆగి చనిపోయిన మజ్జి కొండబాబు కుటుంబాన్ని యువనేత జగన్ బుధవారం ఓదార్చారు. ఇందుకోసం ఆయన ఇసుకగరువుకు చేరుకోగానే స్థానిక గిరిజనులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. జగన్ కొండబాబు ఇంట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొండబాబు భార్య రత్నాలమ్మ, కుమారులు శ్రీను, రవిలను పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జగన్‌ను చూడగానే కొండబాబు కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. వారి ఆవేదన చూసి యువనేత కళ్లు చెమర్చాయి. దీంతో కొద్ది నిమిషాలు ఉద్విగ్నంగా గడిచాయి. యువనేత కొంత సమయానికి తేరుకుని.. ఎలాంటి కష్టమొచ్చినా అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. వారిచ్చిన చోడి అంబలిని ఎంతో ఇష్టంగా సేవించారు. అనంతరం తనను చూసేందుకు వచ్చిన గిరిజనులందరినీ జగన్ పలకరించి ముందుకు సాగారు.

కష్టసుఖాల్లో తోడునీడగా..
కష్టసుఖాల్లో అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా తనకు ఒక్క ఫోన్ చేయమని మల్లవరపు పెదకొండబాబు కుటుంబానికి యువనేత జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక కింతలివల్లాపురానికి చెందిన కొండబాబు మనోవేదనతో మృతి చెందారు. బుధవారం రాత్రి 8 గంటలకు జగన్ వారింటికి చేరుకొని మృతుని భార్యను, ఇద్దరు పిల్లల్ని ఓదార్చారు. సుమారు 20 నిమిషాలపాటు వారి ఇంట గడిపి చిన్నారులు మల్లిక, తరుణ్‌లను ఒడిలోకి తీసుకొని ముద్దాడారు. కొండబాబు తల్లిదండ్రులు రాజు, పైడమ్మ, చెల్లెలు రత్నంతో మాట్లాడారు. ఏ ఆపద వచ్చినా నేనున్నానని వారికి ధైర్యం చెప్పారు. తమ ఇంటికి వచ్చి కన్నీరును తుడిచిన జగన్‌కు తామెప్పుడూ రుణపడి ఉంటామని మృతుడి భార్య, తల్లిదండ్రులు చెప్పారు.

No comments:

Post a Comment