Monday, July 12, 2010

జగన్ వ్యాఖ్యలపై రగులుతున్న రాజకీయం -సిగ్గుతో తలదించుకోవలసిన పనిలేదని తులసిరెడ్డి వ్యాఖ్య - మేము వై.ఎస్. రాజకీయ వారసులం అంటున్న బొత్స


జగన్ ఓదార్పు యాత్ర రోజురోజుకూ స్పష్టమైన రాజకీయ వైఖరి తీసుకుంటున్నది. అందుకు అనుగుణంగానే జగన్ అనుకూల, వ్యతిరేక వైఖరులు తీసుకుంటున్నట్టుగా నాయకుల స్పందన కనిపిస్తున్నది.

ఓదార్పు యాత్రలో పాల్గొనలేకపోతున్నందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు నరకయాతన అనుభవిస్తున్నారని జగన్ శ్రీకాకుళంలో అంటే, అదేమీ లేదని కొందరు ప్రజాప్రతినిధులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోతున్నాయి, సిగ్గుతో తలదించుకుంటున్నానని తునిలో జగన్ వ్యాఖ్యానించిన వెంటనే దిగజారిన మాట నిజమే గాని, సిగ్గుతో తలదించుకోవలసిన పని లేదని పి.సి.సి. అధికార ప్రతినిధి తులసిరెడ్డి స్పష్టం చేశారు.

జగన్ యాత్రలో పాల్గొనాలా, అక్కరలేదా అన్న విషయమై ముఖ్యమంత్రి రోశయ్య గాని, పార్టీ అధిష్ఠానం గాని ఏమైనా సలహాలు ఇచ్చారా , లేదా అన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసేశారు. యాత్రకు వెళ్లమని గాని, వెళ్లొద్దనిగాని తనకు ఎవ్వరూ చెప్పలేదని ఆయన తేటతెల్లం చేశారు. అయినా ఓదార్పులో జగన్ పక్కన ఉండవలసింది వై.ఎస్. మరణవార్త విని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలే గాని, మంత్రులు, ఎమ్మెల్యేలు కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.

మంత్రి బొత్స సత్యనారాయణ అయితే మరో అడుగు ముందుకు వేసి జగన్ వై.ఎస్.కు కేవలం కుటుంబ వారసుడు మాత్రమేనని, తామంతా మాత్రం వై.ఎస్.కు రాజకీయ వారసులమని ఒక గీత గీసే ప్రయత్నం చేశారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏడవాలో, నవ్వాలో కూడా తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment