

ఓదార్పులో ఇతర జిల్లాల నాయకుల హవా
శ్రీకాకుళం, మేజర్‌న్యూస్: జగన్ ఓదార్పు యాత్రలో ఇతర జిల్లాల నాయకుల హవా కనిపిస్తోంది. అదీకూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. గురువారం జరిగిన జగన్ ఓదార్పు యాత్రలో ఇతర జిల్లాల నాయకులు పల్చగా కన్పించినా రెండోరోజు ఆ లోటు పూర్తిగా తీరింది. మాజీ మంత్రి మారెప్ప మొదటి రోజు హాజరుకాగా, రెండోరోజు పక్క జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మందీ మార్బలంతో వచ్చారు. దాదాపు వంద వాహనాలతో జగన్ కాన్వాయిలో ఆయన అనుచరగణం కన్పించారు.

దిగివచ్చిన వారసులు
శ్రీకాకుళం జిల్లాలో జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్రకు మంత్రులు, ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నా వారి అనుచరులు, వారసులు మాత్రం పాల్గొన్నారు. జగన్మోహన్‌రెడ్డికి ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. వారసులు కీలక పాత్ర పోషించడంతో నరసన్నపేట సభ విజయవంతమైంది. మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు కృష్ణదాస్ అసెంబ్లీ సమావేశంలో ఉండడతో వారు రాలేకపోయినా లోపాయికారిగా అన్ని పనులు చక్కదిద్దారు. ధర్మాన కృష్ణదాస్ సతీమణి పద్మప్రియ, ఆమె కుమారుడు రామలింగంనాయుడు, రెవిన్యూమంత్రి ధర్మాన కుమారుడు రామ్‌మనోహర్ నాయుడు జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం వాళ్లు వెంటరాగా నరసన్నపేటలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ధర్మాన కుటుంబ సభ్యులను చూసి జగన్ మరింత ఉత్సాహంతో మాట్లాడారు. ఈసం దర్భంగా ఎమ్మెల్యే కృష్ణదాస్ సతీమణి పద్మప్రియ మాట్లాడి జగన్‌బాబు రావడం వల్ల మీరంతా ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన్నారు.మొత్తం మీద జగన్ నరసన్నపేట వచ్చేసరికి పార్టీ తోడు లేనట్టు ఎవరూ ఊహించలేదు.
జగన్ కోసం ఎంపి కృపారాణి ఎదురు చూపు
శ్రీకాకుళం, మేజర్‌న్యూస్: కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మొదటి రోజు పర్యటన రాత్రంతా జరిగింది. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 6.30గంటలకు టెక్కలి చేరుకోవాల్సి ఉండగా తెల్లవార్లు ఓదార్పు కొనసాగింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు జగన్ కోసం పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి తన స్వగృహంలో ఎదురు చూశారు. కేవలం రెండు గంటల సమయం గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకున్న జగన్ తిరిగి ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. ఎచ్చెర్ల ఎంపిపి బల్లాడ హేమమాలిని రెడ్డి హారతులతో రెండవ రోజు యాత్ర ప్రారంభమైంది. మొదటి రోజు , రెండవ రోజు కూడా ఎంపి కృపారాణి భర్త కిల్లి రామ్మోహన్‌రావు జగన్ పక్కనే ఉండి అన్ని వ్యవహారాలు చూస్తున్నారు.
No comments:
Post a Comment