Monday, July 12, 2010

జగన్ చాప లాగితే చంద్రబాబు చక్రం అడ్డేస్తారా? టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చలు

మధ్యంతరం వస్తే మనకే మంచిదంటున్న నేతలు
అప్పుల మాటేంటని మరికొందరి అభ్యంతరం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రోశయ్య కాళ్ల కింద చాపను వైఎస్ జగన్ లాగేసి.. మధ్యంతర ఎన్నికలు వచ్చే పరిస్థితి సృష్టిస్తే టీడీపీ వైఖరి ఎలా ఉంటుంది? చంద్రబాబు చక్రం అడ్డేసి మధ్యంతర ఎన్నికలు రాకుండా ఆపుతారా? అసెంబ్లీ లాబీల్లో ఈ అంశంపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.

"జగన్ తనవెంట ఉన్న ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరింపజేస్తే ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఆయన 40 మంది ఎమ్మెల్యేలను సమీకరించగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుంది. మధ్యంతర ఎన్నికలు తప్పవు'' అని ఒక సీనియర్ ఎమ్మెల్యే విశ్లేషించారు.

మధ్యంతర ఎన్నికలపై చర్చ టీడీపీ వర్గాల్లోనూ ఉన్నా.. ఆ పార్టీ అధినాయకత్వం మాత్రం దీనిపై ఏమీ చెప్పట్లేదు. నాలుగు రోజుల క్రితం టీడీఎల్పీ సమావేశం జరిగినప్పుడు అందులో ఈ ప్రస్తావన వచ్చింది.

పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జగన్ సృష్టిస్తున్న వాతావరణాన్ని బట్టి చూస్తే మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోందని, అందరం దానికి సంసిద్ధంగా ఉంటే మంచిదని అన్నప్పుడు పక్కనున్న అనేక మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనపై విరుచుకుపడ్డారు.

గత ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల తాలూకు అప్పులే ఇంకా తీరలేదని, ఇంతలోనే ఎన్నికలేమిటని వారంతా అన్నారు. ఈ చర్చనంతా ఆ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నవ్వుతూ విన్నారే తప్ప ఏ ప్రతిస్పందనా వ్యక్తం చేయలేదు.

జగన్ చాప లాగితే రోశయ్య సర్కారును టీడీపీ నిలబెట్టినా తప్పులేదని, గతంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చాలాసార్లు అదే పని చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ మరో నేత దానితో విభేదించారు.

No comments:

Post a Comment